‘‘లాఠీ’ (1992) చిత్రంతో చిత్ర పరిశ్రమకి వచ్చాను. ‘యుఫోరియా’ నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్‌తో ఉన్నాను. నేను ప్రేక్షక దేవుళ్లని నమ్ముతాను. వారి సమయం, డబ్బు, విజ్ఞతకు విలువ ఇస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘యుఫోరియా’ తీశాను. ఈ మూవీ వల్ల వారి టైమ్, మనీ... ఏదీ వృథా కాదు’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలి పారు. భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ నటించిన చిత్రం ‘యుఫోరియా’.
గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఈ మూవీ నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి భూమిక బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో తను జీవించింది’’ అన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ సినిమా చూశాను. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి నా పాత్ర గురించే ఆలోచించాను (భావోద్వోగంతో)’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమా అందరి మనసుల్ని తాకుతుందని భావిస్తున్నాను’’ అని నీలిమ గుణ చెప్పారు.


