తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికి 94 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. దానినే కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’ (తెలుగు సినిమా డే)గా సినీ పరిశ్రమ, సంస్థలు చేస్తున్నారు. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం ఆరంభమైంది. అంతకు ముందు మాటలు, పాటలు ఏమీ లేకుండా బొమ్మలు మాత్రం కదిలే మూగ సినిమాలు వచ్చేవి. భాషతో ప్రమేయం లేని సినిమాలు గనక అవి భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి, అందరినీ ఆకర్షించేవి. 1931 మార్చి 14న హిందీ, ఉర్దూల సమ్మిశ్రమ భాషలో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలైంది.
అక్కడ నుంచి క్రమంగా వివిధ భారతీయ భాషల్లో మాటలున్న సినిమాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే తీశారు! నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది.
ఆ వెనువెంటనే మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఈసారి ఏకంగా 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ‘‘100% సంపూర్ణ తెలుగు టాకీ’’గా ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగాయి. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకు వచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 94 ఏళ్ళు పూర్తయ్యాయి.
మన ‘భక్త ప్రహ్లాద’ రూ. 18 వేలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ప్రసిద్ధ సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఆ సినిమా తీశారు. అప్పటికే తెలుగునాట నాటక రచయితగా ప్రసిద్ధుడైన చందాల కేశవదాసు ఆ సినిమాలో పాటలు అందించారు. తొలి తెలుగు సినీ గేయరచయితగా కీర్తి గడించారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలా బాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోని కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అటుపైన విజయవాడ (శ్రీమా రుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న రిలీజైంది.
అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఎందరో మహామహుల జీవితకృషి కారణంగా ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటింది. ఇటీవలి ‘ఆర్.ఆర్.ఆర్’తో అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా ఎదిగింది. అలనాటి ‘మల్లీశ్వరి’, ఆ మధ్య ‘శంకరాభరణం’ నుంచి నిన్నటి ‘బాహుబలి’ మీదుగా రానున్న రాజమౌళి – మహేశ్‌బాబుల ‘వారణాసి’ దాకా మన తెలుగు సినిమా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.


