మలయాళ చిత్రసీమలో నటుడిగా, రచయితగా, చిత్రనిర్మాతగా మహోన్నత ఉనికిని చాటుకున్న శ్రీనివాసన్(69) శనివారం కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలుగా మలయాళ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఉదయం 8.30 గంటలకు ఆయన మరణించారు. శ్రీనివాసన్ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా..! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కుమారుడు వినీత్ శ్రీనివాసన్ కూడా సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ' అనే చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యాడు.
శ్రీనివాసన్ మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. మలయాళ పరిశ్రమ గొప్ప రచయిత,దర్శకుడు,నటుడిని కోల్పోయింది. ఆయనకు వీడ్కోలు చెప్పడం కష్టంగా ఉంది. కానీ, వెండితెరపై మీరు పంచిన నవ్వులు ఎప్పటికీ ఉంటాయి. పరిశ్రమ కోసం మీరు చేసిన పనులకు ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు.


