
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్-1(Kantara: Chapter 1) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేరాడు.
రిషబ్ శెట్టి మ్యాజిక్‌కు రాహుల్ ఫిదా అయిపోయాడు. "ఇప్పుడే కాంతార సినిమా చూశాను. రిషబ్ శెట్టి మరోసారి అద్బుతం సృష్టించాడు. ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని" రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
2022లో విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్-2025లో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత తరపున ఆడుతున్నాడు.
తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కేఎల్ సన్నద్దం కానున్నాడు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌లో పాల్గోనుంది.
రాహుల్ టెస్టు క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గత పది ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకోవడంలో రాహుల్ ది కీలక పాత్ర. ఇప్పుడు అదే జోరును విండీస్‌పై కూడా కొనసాగిస్తున్నాడు.
చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి’