
భారత క్రికెట్‌లో కొన్నాళ్లుగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు మారుమ్రోగిపోతోంది. పన్నెండేళ్ల వయసులోనే రంజీల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్లకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అడుగుపెట్టాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
ఫాస్టెస్ట్ సెంచరీలు
ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాది వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.
ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ జుబిన్ బరూచా (Zubin Barucha) వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు
‘‘వీలైనంత త్వరగా అతడిని సీనియర్ జట్టు (టీమిండియా)లోకి పంపించాలి. చాలా ఏళ్ల క్రితం సచిన్ టెండుల్కర్ (16 ఏళ్ల వయసులో అరంగేట్రం) విషయంలో ఇలాగే చేశారు. ఇప్పుడు వైభవ్ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.
కనీసం ఇండియా-‘ఎ’ తరఫునైనా అతడిని ఆడించాలి. తక్షణమే ఆ జట్టులోకి వైభవ్‌ను పంపించండి. ఇటీవల అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ బౌలర్ల బౌలింగ్ చూస్తే.. వైభవ్ గనుక జట్టులో ఉండి ఉంటే డబుల్ సెంచరీ బాదేవాడని అనిపించింది.
జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడానికి స్టీవ్ స్మిత్ వంటి మేటి బ్యాటర్లే భయపడతారు. మా జట్టు తరఫున నెట్స్‌లో బరిలోకి దిగినా ఆర్చర్ ప్రధాన మ్యాచ్‌లో మాదిరే బౌల్ చేస్తాడు. అలా ఓసారి ప్రాక్టీస్ సెషన్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో స్మిత్ తలకు గాయమైంది.
ఆరోజు వైభవ్ అద్భుతం చేశాడు
అప్పటి నుంచి ఆర్చర్ నెట్స్‌లో ఉంటే స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చేవాడే కాదు. అందుకే ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ బ్యాటింగ్ చేయబోతున్నపుడు నేను భయపడ్డాను. కానీ.. ఆ పిల్లాడు బ్యాక్‌ఫుట్ షాట్ ఆడి.. బంతిని స్టేడియం అవతలకు తరలించాడు.
నాతో పాటు కోచింగ్ స్టాఫ్.. ఆఖరికి ఆర్చర్ కూడా ఆశ్చర్యపోయాడు’’ అని జుబిన్ బరూచా చెప్పుకొచ్చాడు. వైభవ్‌ను త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని చీఫ్ సెల క్టర్ అజిత్ అగార్కర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు.
కాగా సొంతగడ్డపై ఇండియా-‘ఎ’ జట్టు ఇటీవల ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను 1-0తో భారత్ సొంతం చేసుకుంది.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం