50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం | Harjas Singh Smashes 314 Runs Off 141 Balls Scripts History | Sakshi
Sakshi News home page

50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

Oct 5 2025 9:34 AM | Updated on Oct 5 2025 11:01 AM

Harjas Singh Smashes 314 Runs Off 141 Balls Scripts History

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ హర్జాస్‌ సింగ్‌ (Harjas Singh) ఊహకందని రీతిలో బ్యాట్‌తో చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 314 పరుగులు సాధించాడు. ఆసీస్‌ దేశీ క్రికెట్‌లో భాగంగా యాభై ఓవర్ల మ్యాచ్‌లో ఈ మేరకు విధ్వంసకర ట్రిపుల్‌ సెంచరీ (Triple Century In 50 Over Cricket)తో విరుచుకుపడ్డాడు.

వెస్టర్న్‌ సబ్‌అర్బ్స్‌ (Western Suburbs) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 ఏళ్ల హర్జాస్‌ సింగ్‌.. సిడ్నీ క్రికెట్‌ క్లబ్‌ జట్టుతో మ్యాచ్‌ సందర్భంగా ఇలా పరుగుల సునామీ సృష్టించాడు. తద్వారా గ్రేడ్‌ లెవల్‌ క్రికెట్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో త్రిశతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

చండీగఢ్‌ నుంచి..
హర్జాస్‌ సింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 35 సిక్సర్లతో పాటు 14 ఫోర్లు ఉండటం విశేషం. భారత సంతతికి చెందిన హర్జాస్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు 2000లోనే చండీగఢ్‌ నుంచి వలస వెళ్లారు.

సౌతాఫ్రికా వేదికగా అండర్‌-19 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్లో భారత్‌- ఆసీస్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా హర్జాస్‌ సింగ్‌ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. టైటిల్‌ పోరులో 64 బంతుల్లో 55 పరుగులతో సత్తా చాటి.. ఆసీస్‌ను గెలిపించాడు.

ఇది ప్రత్యేకం 
తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించడం పట్ల హర్జాస్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. పవర్‌ హిట్టింగ్‌ ఆడటం తనకు అలవాటని.. ఈరోజు మాత్రం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. 

కాగా హర్జాస్‌ సింగ్‌ ఇలాగే చెలరేగితే.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్న తన సహచర ఆటగాడు సామ్‌ కొన్‌స్టాస్‌ మాదిరి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఖాయం.

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హర్జాస్‌ సింగ్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధిస్తే.. అంతకుముందు ఫస్ట్‌ గ్రేడ్‌ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున ఫిల్‌ జాక్వెస్‌ (321), విక్టర్‌ ట్రంపర్‌ (335) ట్రిపుల్‌ సెంచరీ చేశారు.

196 పరుగుల తేడాతో జయభేరి
మ్యాచ్‌ విషయానికొస్తే... హర్జాస్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా వెస్టర్న్‌ సబ్‌అర్బ్స్‌ యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 483 పరుగులు భారీ స్కోరు సాధించింది. అయితే, కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ క్రికెట్‌ క్లబ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వెస్టర్న్‌ సబ్‌అర్బ్స్‌ ఏకంగా 196 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

చదవండి: అందుకే రోహిత్‌ శర్మపై వేటు: అగార్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement