సంప్రదాయ హనుక్కా వేడుకలో తీవ్ర విషాదం
ఆ్రస్టేలియా బాండీ బీచ్‌లో ఇద్దరు ముష్కరుల కాల్పులు
16 మంది మృతి ఇద్దరు పోలీసులు సహా 38 మందికి గాయాలు
పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం మరొకరి అరెస్టు
సిడ్నీ: ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదాంతంగా మారింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బీచ్‌లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రకటించింది.
మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకోవడం, ఆయుధాలతో విరుచుకుపడడంపై కచ్చితంగా ఉగ్రవాద దాడిగా ప్రభుత్వం పేర్కొంది. యూదులపై కాల్పుల జరిపిన ఇద్దరు ముష్కరులపై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒకరిని మట్టుబెట్టారు.
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రెండో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాద దాడిని ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షస కాండ ఘటన ఆ్రస్టేలియా హృదయాన్ని గాయపర్చిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని అల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు.
విచ్చలవిడిగా కాల్పులు
ప్రాచీన కాలంలో జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు హనుక్కా పండుగను ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. యూదులకు ఇది ప్రధానమైన పండుగ. ఆస్ట్రేలియాలోని యూదులు బాండీ బీచ్‌లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. వందలాది మంది గుమికూడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు.
ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న ఇద్దరు ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే 16 మంది విగతజీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్‌లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పుల్లో జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌గా గుర్తించారు. సిడ్నీ బానీరిగ్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ
ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆ్రస్టేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
యూకేలో భద్రత కట్టుదిట్టం
ఆ్రస్టేలియాలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఖండించారు. యూదుల మరణించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. యూకేలో యూదులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా లండన్‌లో యూదుల ప్రార్థనా మందిరాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలియజేశారు. సామూహిక వేడుకల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
దేశంలో ఆయుధ చట్టాలు కఠినం
ఆ్రస్టేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్‌లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు.
ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆ్రస్టేలియాలోని డారి్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచి్చన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్‌లాండ్ స్టేట్‌లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.
పెచ్చరిల్లుతున్న యూదు వ్యతిరేకత
ఆ్రస్టేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆ్రస్టేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు యూదులకు తగిన రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ్రస్టేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రియల్ హీరో అహ్మద్
బీచ్‌లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్‌ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు.


