ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్‌లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్‌కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
హనుక్కా పండుగ ఎప్పుడు?
యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఏ నగరాలు ప్రధాన టార్గెట్?
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.


