మెల్‌బోర్న్: పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్‌లైన్ వేదిక రెడ్డిట్ సవాలు చేసింది. ఈ అమెరికన్ ఆన్‌లైన్ ఫోరమ్ శుక్రవారం హైకోర్టులో దావా వేసింది. యువతను రక్షించాలనుకుంటే ప్రభుత్వానికి మరింత మెరుగైన మార్గాలున్నాయని, కానీ సోషల్ మీడియా కనీస వయసు చట్టం వల్ల రాజకీయ చర్చల నుంచి వేరుచేయడం అవుతుందని, ధ్రువీకరణ ప్రక్రియ కూడా అంత సురక్షితం కాదని రెడ్డిట్ తెలిపింది.
16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల ఆన్‌లైన్ భద్రతరీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించకపోతే రెడ్డిట్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, కిక్, స్నాప్‌చాట్, త్రెడ్స్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్‌లకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటికే ఇద్దరు బాలికల తరపున సిడ్నీకి చెందిన హక్కుల వేదిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు గత నెలలో కేసు వేసింది. కాలిఫోరి్నయాకు చెందిన రెడ్డిట్ దానిని అనుసరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రెండు వాజ్యాలు పేర్కొన్నాయి.


