పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్‌కు ఘోర పరాభవం ఎదురైంది. తుర్కిస్థాన్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి ఆయన దాదాపు 40 నిమిషాలు ఎదురుచూశారు. అయినప్పటికీ పుతిన్ కలవకపోవడంతో షెహబాజ్ పుతిన్ ఉన్న ప్రదేశానికి నేరుగా వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అధ్యక్షుడిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్- అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తరచుగా పాకిస్థాన్‌ని పొగుడుతూ వారిని బుట్టులో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం ఆ దేశ ప్రధాని షెహబాజ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌తోనూ నేరుగా చర్చలు జరిపారు. అంతేకాకుండా పాకిస్థాన్‌ను దక్షిణాసియాలో అవసరమైన మిత్రుడు అని గతంలో అభివర్ణించాడు.
ఇదే సమయంలో భారత్‌తో ట్రంప్ డిస్టెన్స్ పెంచాడు. భారత్‌పై అధిక పన్నులు విధించడంతో పాటు ఆపరేషన్ సిందూర్ తానే ఆపానంటూ ప్రేలాపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. అయితే భారత్‌కు ఎల్లవేళలా నమ్మదగిన మిత్రుడిగా ఉండే రష్యా ఇప్పుడు పాక్‌కు చిన్న ఝలక్ ఇచ్చింది.
తుర్కిస్థాన్‌లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సమ్మిట్‌లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశానికి వెళ్లాడు. ఆ పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడితో పుతిన్ భేటీ జరగాల్సి ఉంది. కాగా ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్‌తో పుతిన్ సమావేశంలో ఉన్నారు. దీంతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రితో కలిసి పుతిన్‌ను కలవడానికి ఎదురుచూశారు.
దాదాపు 40 నిమిషాలపాటు వేచి చూసినప్పటికీ భేటీ ముగియకపోవడంతో షెహబాజ్ అసహానానికి గురయ్యారు. దీంతో పుతిన్ చర్చలు జరుపుతున్న ప్రాంతానికి నేరుగా వెళ్లాడని అక్కడ కొద్ది సేపు ఉన్న అనంతరం షెహబాజ్ తిరిగి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలవుతోంది. పుతిన్ సమయాన్ని వృథా చేసుకోరు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ట్రంప్ కూడా అలానే చేశారని మరో యూజర్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. పుతిన్‌కు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ స్వయంగా వెళ్లారు. అంతేకాకుండా పుతిన్ తనకు మిత్రుడని సంభోదించారు.


