దక్షిణ చైనాలో భారీ ఎముకలతో, కనీవినీ ఎరుగని పెద్ద డైనోసార్ శిలాజాలను గుర్తించారు. ఈ భారీ శిలాజం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది దాదాపు 92 అడుగుల (సుమారు 28 మీటర్లు) పొడవు ఉంటుందని అంచనా. టోంగ్నాన్‌లాంగ్ జిమింగి (Tongnanlong zhimingi) అనే పేరుపెట్టారు. ఈ భారీ 92 అడుగుల సౌరోపాడ్ (Sauropod) జాతి డైనోసార్ ఇపుడు భూమిపై అతిపెద్ద భూ జంతువులలో ఒకటిగా నిలుస్తోంది.
న్యూ జురాసిక్ డైనోసార్ టోంగ్నాన్‌లాంగ్
టోంగ్నాన్ జిల్లా తవ్వకాలలో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. డైనోసార్ శిలాజాలకు భౌగోళిక హాట్‌స్పాట్ అయిన సిచువాన్ బేసిన్‌లోని ప్రాంతమైన చాంగ్‌కింగ్‌లోని టోంగ్నాన్ జిల్లాలో నిర్మాణ పనుల సమయంలో ఈ అవశేషాలను మొదటిసారిగా 1998లో తవ్వారు. కానీ ఇటీవలే శాస్త్రవేత్తలు పీర్-రివ్యూడ్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో పూర్తి విశ్లేషణను ప్రచురించారు.
పొడవాటి మెడ, తోక, చిన్న తల ఉండే శాకాహారి డైనోసార్ ఇది. అవశేషాలలో అవయవాలు, వెన్నుపూసలు ,భుజం ఎముకలు కూడా ఉన్నాయి. ఈ భాగాలు ఇది సౌరోపాడ్ సమూహం అయిన మామెన్చిసౌరిడేకు చెందినదని నిర్ధారించారు. గతంలో నమోదు చేయబడిన వాటి కంటే పొడవైన భుజం బ్లేడ్ పొడవు 1.8 మీటర్ల కంటే ఎక్కువ. ఇది డైనోసార్ల పరిమాణ పరిమితులను ప్రశ్నిస్తోందనీ, ఎందుకంటే ఇంత పెద్దవిగా పెరగడం చాలా కష్టమని భావిస్తున్నారు. అస్థిపంజరం సుయినింగ్ ఫార్మేషన్ రాక్ బెడ్ లోపల ఉంది. ఇది సుమారు 147 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అక్కడ వరదలు సంభవించిన సంఘటనలు అక్కడ చాలా త్వరగా మృతదేహాలను పాతిపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.
మూడు డోర్సల్ వెన్నుపూస, ఆరు కాడల్ వెన్నుపూస పూర్తి స్కాపులా , కోరాకోయిడ్ టిబియా, ఫైబులా, మెటాటార్సల్స్ మరియు గోళ్ల భాగాలు తదితరాలు ఈ తవ్వకాల్లో గుర్తించినవాటిల్లో ఉన్నాయి.
డైనోసార్ ఇంత భారీ పరిణామంలో ఎలా?
ఈ జంతువులు విపరీతమైన పరిమాణం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి? వాటి చిన్న పుర్రెలు, చాలా పొడవైన, సరళమైన మెడకు సపోర్ట్‌గా నిలవడంతోపాటు, కారగాలితో నిండిన ఎముకలు భారీ శరీరాన్ని చాలా తేలికగా ఉంచుతాయి. సమర్థవంతమైన శ్వాస వ్యవస్థలు వాటి లోపల ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరిచాయి. ఈ లక్షణాలు కాలక్రమేణా పరిమాణానికి బాటలు వేశాయి. నేడు కనిపించే ఆధునిక పక్షులలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనవేత్తలు అంటున్నారు. ఈ పరిణామ మిశ్రమం స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ జెయింట్స్ ఎలా వృద్ధి చెందాయో వివరించడానికి కొత్త శిలాజం సహాయపడుతుందట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అసలు అధ్యయన ప్రచురణలో పొందుపర్చారు.


