వాషింగ్టన్: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.


