రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ
గాందీనగర్: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్ గుజరాత్ గురించి మాట్లాడుకునేది.
ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లాంటి క్రిటికల్ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.


