నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్‌సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..
ఎమ్ఎమ్‌పీ (మిక్స్‌డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్‌కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.
దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్‌లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!
ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.
జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
భారత్‌లో..
భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్‌పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.
మిక్స్‌డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..
ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్‌లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.
ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.
ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు.
ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్‌ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్‌లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్‌పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది.


