తమిళనాడులో అధికారం హస్తగతం చేసుకోవడానికి పుదుచ్చేరిని గేట్‌వేగా వాడుకోవాలని భావిస్తున్న స్టార్ హీరో విజయ్‌కు బ్రేక్ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పెట్టిన వ్యక్తి కూడా తన పార్టీకి చెందిన కీలక నేత బంధువువే కావడం గమనార్హం. కొత్త పార్టీతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.
లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్.. తాను సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ 'జేసీఎం మక్కల్ మాండ్రం'ను (JCM Makkal Mandram) రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు వెల్లడించారు. ఆ పార్టీకి 'లక్ష్య జననాయక కచ్చి' (Latchiya Jananayaka Katchi) అని పేరు పెడతామని, డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ బావమరిదే చార్లెస్ మార్టిన్. చార్లెస్ సోదరి డైసీ మార్టిన్‌ను అర్జున్ వివాహం చేసుకున్నారు.
మార్పు తెస్తా
పుదుచ్చేరికి 1954లోనే స్వాతంత్ర్యం వచ్చినా, దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేదని చార్లెస్ మార్టిన్ (Charles Martin) అన్నారు. పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో డిసెంబర్ 14 ఒక 'చారిత్రాత్మక ఘట్టం' కానుందని పేర్కొన్నారు. తనకు అండగా నిలబడి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
సింగపూర్ చేస్తా
2026 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చార్లెస్ మార్టిన్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిజాయితీగా లేవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోయాయని చార్లెస్ విమర్శించారు. పాలనలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. సింగపూర్ తరహాలో పుదుచ్చేరిని అభివృద్ధి చేయడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని 'ఇండియా టుడే'తో అన్నారు.
జట్టు కడతారా?
కాగా, మంగళవారం పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహించిన విజయ్.. ముఖ్యమంత్రి రంగస్వామి నాయకత్వంలోని ఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడులోని డీఎంకే సర్కారుకు చురకలు అంటించారు. రంగస్వామి ప్రభుత్వంపై విజయ్ సానుకూలంగా మాట్లాడటంతో.. పుదుచ్చేరి ఎన్నికల్లో వీరిద్దరూ జట్టు కడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
చదవండి: విజయ్, రంగస్వామి మెగా ప్లాన్


