( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్‌గా ఉండాలంటూ వారికి ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్సయింది. అది నాకు చాలా ఆవేదన కలిగించిందంటూ ఎంపీలతో మోదీ అన్నారు.
తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది. 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నలు గుప్పించారు. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు.
ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. నిత్యం ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండాలంటూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఎంపీలకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.
కాగా, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది. విందు ఏర్పాట్లను కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి అప్పగించారు.
విందు కార్యక్రమంలో 54 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కేంద్రమంత్రి కూర్చునే ఏర్పాట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నారు.


