బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు.
ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు.
ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.
(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ)


