పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్‌ | CM Revanth says Musi homeless to get houses in their constituencies | Sakshi
Sakshi News home page

పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్‌

Mar 14 2026 2:43 AM | Updated on Mar 14 2026 2:43 AM

CM Revanth says Musi homeless to get houses in their constituencies

మూసీ నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లోనే ఇళ్లు 

‘మూసీ ఇన్‌వైట్‌’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నది పునరుజ్జీవంతో రాష్ట్రం గ్రోత్‌ ఇంజిన్‌గా మారుతుంది 

కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తున్నారు 

కడుపులో కుళ్లు, మాటల్లో విషంతో అడ్డుకోవాలని చూస్తున్నారు  

రాజకీయ స్వార్థం కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా? 

బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెబితే దాన్ని అమలు చేద్దాం 

ఏవైనా లోపాలు ఉంటే సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్న సీఎం 

అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. 

ఇది భవిష్యత్‌ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘మూసీ ఇన్‌వైట్‌’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. 

బ్యూటిఫికేషన్‌.. లూటిఫికేషన్‌ అంటూ అసత్యాలు 
‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావు­లు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీ­లు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాద­నతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్‌ మీడి­యాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్‌.. లూటిఫికేషన్‌ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు.  

గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. 
రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీ­టర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్‌ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మా­త్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళా­ల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబా­హు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. 

నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరాన్ని నిజాం ఎకనామిక్‌ జోన్‌గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 

1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు.  

సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్‌కు ఉంది. కానీ బాపూఘాట్‌ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్‌ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం.  

అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? 
ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్‌ హౌస్‌ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్‌ జాబ్స్‌ క్రియేట్‌ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్‌ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్‌ఆర్‌ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుంది. 

మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement