ఆటకు మన వద్ద ఏమాత్రం లేని ఆదరణ
ఇక ముందైనా మార్పు వస్తుందా..?
ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీలో నిర్వహిస్తే సాధ్యమే..
ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ మన భాగ్యనగరానికి వస్తున్నాడు. ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి అతడి రాకపై పలు రకాలుగా చర్చ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అతడి ఈవెంట్ కోసం భారీ ధరతో టికెట్లున్నా వెనక్కి తగ్గకుండా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడిపోతున్నారు. శనివారం జరిగే ఈ షో కోసం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో ఉప్పల్ స్టేడియం హౌస్‌ఫుల్ కావడం ఖాయం. కానీ మెస్సీ మాయ 3 గంటల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మన వద్ద అసలైన ఫుట్‌బాల్ ఏమిటో కనిపిస్తుంది. ఒక అసాధారణ ఆటగాడిపై అభిమానం ఉండటం సరే కానీ.. మన వద్ద ఆటకు ఏమాత్రం ఆదరణ ఉందనేది ఆసక్తికరం. మెస్సీ షో కారణంగా ఇక్కడ మున్ముందు ఏదైనా మార్పు కనిపిస్తుందా అనేది చర్చనీయాంశం.
ఎస్‌ఏ రహీమ్, నయీముద్దీన్, తులసీదాస్ బలరామ్, పీటర్ తంగరాజ్, షాహిద్ వసీమ్, మొహమ్మద్ హబీబ్, షబ్బీర్ అలీ, జుల్ఫికర్ అలీ.. ఒకరా, ఇద్దరా ఎంతో మంది హైదరాబాద్ దిగ్గజాలు భారత ఫుట్‌బాల్‌ను సుదీర్ఘ కాలం నడిపించారు. 1950వ, 1960వ దశకాల్లో భారత జట్టు మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లతోనే కనిపించేది. మన సిటీ పోలీస్ టీమ్ అంటే దేశంలోని ఏ జట్టుకైనా హడల్. సంతోష్ ట్రోఫీ, డ్యురాండ్ కప్, రోవర్స్ కప్.. టోర్నీ ఏదైనా విజేత హైదరాబాద్ జట్టు మాత్రమే. ఒలింపిక్స్ క్రీడల్లో భారత అత్యుత్తమ ప్రదర్శనగా నాలుగో స్థానం 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో వచ్చింది. ఈ టీమ్‌లో ఎనిమిది మంది హైదరాబాద్ ఆటగాళ్లు ఉండటం విశేషం.
మొత్తంగా 1948 నుంచి చూస్తే మన నగరం నుంచి 14 మంది ఒలింపియన్లు, 21 అంతర్జాతీయ ఫుట్‌బాలర్లు, 9 మంది కోచ్‌లు తమ ప్రతిభతో భారత ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశారు. ఇదంతా ఘనమైన గతం. 1980వ దశకంలోకి వచ్చేసరికి ఆటలో ఆ కళ తప్పింది. వేర్వేరు కారణాలతో ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి పడిపోతూ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ టీమ్ కూడా బలహీనంగా మారిపోవడంతో ఫలితాలు రావడం ఆగిపోయాయి. ఆపై బెంగాల్, కేరళ జట్లు ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించడం మొదలైంది. వీటికి తోడు గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా బలంగా దూసుకొచ్చాయి. మెలమెల్లగా హైదరాబాద్ ఫుట్‌బాల్ చివరి దశకు వచ్చేసింది. కనీసం ప్రతిభాన్వేషణ లేకపోవడం, టోరీ్నల నిర్వహణ జరగకపోవడంతో సహజంగానే ఇక్కడ ఫుట్‌బాల్ మరింతగా దిగజారిపోయింది.

1962లో ఏషియన్ గేమ్స్‌లో ఎస్‌ఏ రహీమ్ జట్టు
ఐఎస్‌ఎల్‌తో పెరిగిన ఆసక్తి..
దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరంలో ఫుట్‌బాల్ (Football) నామ్‌కే వాస్తేగానే నడిచింది. అయితే అదృష్టవశాత్తూ కొత్త తరంలో మళ్లీ ఆటపై కాస్త ఆసక్తి పెరగడంతో పాటు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా పలు కార్పొరేట్ స్కూల్స్ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా టీమ్‌లు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో బరిలోకి దించడంతో మళ్లీ హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. ప్రతిష్టాత్మక ఐ–లీగ్‌లో నగరానికి చెందిన ‘శ్రీనిధి’ దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ టీమ్ ఉండటం కూడా ఇక్కడి ఆటకు గుర్తింపు తెచ్చింది. ఈ టీమ్‌లో నేరుగా స్థానిక ఆటగాళ్లు లేకపోయినా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్‌ఎఫ్‌సీ) ఇక్కడ అందరిలో ఆసక్తిని పెంచడంలో సఫలమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్‌ఎల్ మ్యాచ్‌లకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనం. దీంతో పాటు పలు ఫుట్‌బాల్ క్లినిక్‌లు, క్యాంప్‌ల ద్వారా హెచ్‌ఎఫ్‌సీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించింది. దురదృష్టవశాత్తూ ఆర్థిక పరమైన కారణాలతో ఐఎస్‌ఎల్‌కు హెచ్‌ఎఫ్‌సీ దూరమైనా.. అది ఇక్కడ ఉన్నన్నాళ్లు మంచి ప్రభావం చూపగలిగింది.

1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు
ప్రైవేట్ క్లబ్‌ల చొరవతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే ఫుట్‌బాల్‌పై తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నా గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. తెలంగాణ జట్టు జూనియర్ స్థాయిలో విజయం సాధించి వచ్చి సీఎంను కలిసిన తర్వాత ఆయన ఆటను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంను ఫుట్‌బాల్‌కు కేంద్రంగా మారుస్తామని చెప్పినా.. మైదానం ఎప్పటిలాగే సౌకర్యాల లేమితో కనిపిస్తోంది. జింఖానా మైదానంలో కూడా చాలా పరిమితంగానే ఆడేందుకు అవకాశం లభిస్తోంది. ఏళ్లుగా టోర్నీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇలాంటి స్థితిలో ‘శ్రీనిధి’ యాజమాన్యం ఆటకు అండగా నిలుస్తోంది. అక్కడి మైదానాల్లో ప్రాక్టీస్, టోర్నీల నిర్వహణతో పాటు కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సొంత డబ్బులతోనే ఆటను రక్షించే ప్రయత్నం చేస్తుండటం సానుకూల అంశం. పాతబస్తీలోని చారిత్రాత్మక అబ్బాస్ క్లబ్, బొల్లారం క్లబ్‌లతో పాటు కొన్ని పాత క్లబ్‌లు మాత్రమే ఇంకా ఆటను బతికిస్తున్నాయి. దేశంలో ఎక్కడ టోర్నీ జరిగినా తమ జట్లను పంపి ఆయా క్లబ్‌కు ఫుట్‌బాల్‌తో తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వం తలచుకుంటే..
గత ఏడాది సెసెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించింది. భారత్‌తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. టోర్నీ నిర్వహణ సమయంలో కూడా ప్రభుత్వం బాగా హడావిడి, ప్రచారం చేసింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రికి ఈ ఆటపై ఉన్న ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కసారి టోర్నీ ముగియగానే అంతా గప్‌చుప్. ఇప్పుడు మెస్సీ రాకను కూడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రచార కార్యక్రమంలా చూస్తోంది. నిజాయితీగా చూస్తే ఈ ప్రైవేట్ కార్యక్రమంతో ఒరిగేదేమీ ఉండదు.
మెస్సీ కూడా తన పరిమితుల్లో కొద్దిసేపు
స్వల్పంగా పెనాల్టీలు ఆడి ఒక నాలుగు పాస్‌లు ఇచ్చి మమ అనిపిస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాం మన ఫుట్‌బాల్‌ను మార్చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఫుట్‌బాల్ రాతను మార్చాలనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఆటను అభివృద్ధి చేయాలంటే ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఆపై ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీల నిర్వహణ ఒక క్రమంలో జరగాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒక బృహత్ లక్ష్యంతో పని చేస్తే భారత ఫుట్‌బాల్‌లో మరోసారి నాటి హైదరాబాద్ మెరుపులు కనిపిస్తాయి.


