తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా)తో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల పాటు ఐఫా వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా వేడుకలకు హైదరాబాద్ వరుసగా మూడేళ్ల పాటు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా మూడేళ్లపాటు ఐఫా ఉత్సవం నిర్వహించడం ద్వారా దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా, సినిమా ఆధారిత పర్యాటకం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ కేంద్రంగా మా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
గత 25 ఏళ్లుగా గ్లోబల్ కల్చరల్ సూపర్ బ్రాండ్‌గా వెలుగొందుతున్న ఐఫా.. లండన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సింగపూర్, అబుదాబి, మాడ్రిడ్ లాంటి ప్రపంచ రాజధానులలో ఓ ఐకానిక్ లెగసీని నిర్మించింది. అలాంటిది రాబోయే మూడేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఈవెంట్స్ జరగబోతుండటం చాలా విశేషం అని చెప్పొచ్చు.


