ప్రభాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల సంక్రాంతి బరిలో ఉంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడు మారుతి వద్దని అభిమానులు గోలగోల చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ దర్శకుడిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే అలా తిట్టకపోతే తాను 'రాజాసాబ్' తీసేవాడిని కాదని మారుతి చెప్పుకొచ్చాడు.
'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ రెండో సీజన్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు వచ్చిన మారుతి.. తనపై వచ్చిన విమర్శల గురించి, ట్రోల్స్ గురించి ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇప్పుడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొన్న నటి ప్రగతి.. రీసెంట్‌గానే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కూడా గెలుచుకుంది. ఈమె గురించి కూడా మారుతి మాట్లాడారు.
(ఇదీ చదవండి: రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?)
'నటి ప్రగతి గారికి ఇదో ఎమోషనల్ డే అని అర్థమైంది. మేడమ్.. మిమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారని ఏం అనుకోవద్దు. ఎందుకంటే అలా తిట్టకపోతే మీరు గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు. నేను 'రాజాసాబ్' తీసేవాడిని కాదు. ట్రోలర్స్ నిజంగా పనులన్నీ మానుకుని మనకోసం టైమ్ కేటాయించి, పాజిటివిటీ అంతా చంపుకొని, బ్రెయిన్‌లోకి నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని నాలుగు తిట్లు తిడుతున్నారు. పాపం వాళ్ల దగ్గరున్న నెగిటివిటీనే పంచుతున్నారు'
'వాళ్ల దగ్గర నాలుగు బూతు మాటలు.. నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయి. అవే పంచుతున్నారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ చూసినప్పుడు.. ఒరేయ్, ఇది తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదా అనుకుంటాను. ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. మీరు కూడా మిమ్మల్ని తిట్టేవాళ్లని ఎతుక్కోండి. లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే, మేము ఎదుగుతూ ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నెగిటివ్ కామెంట్స్ చేసే వారందరికీ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము.. మేము సాధించలేం' అని మారుతి చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో మిస్ అవుతున్న 'నవ్వు')


