బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్‌కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
అసలేం జరిగిందంటే..
ఈవెంట్లో స్టేజీపై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్‌లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్‌లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.
కాంతార మూవీ..
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.


