బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్‌బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్‌లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.
‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్‌లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్‌లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.


