సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సులభమే. కానీ ఆ స్టార్‌డమ్ ఎప్పటికీ నిలబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి కనుమరుగయ్యారు. ఒకప్పుడు వరుస చిత్రాలు చేసిన వారు.. పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు.
అయినప్పటికీ సినిమాపై ఉన్న ఇష్టంతో చాలామంది సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వారిలో ఈ ఏడాది దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్నారు. అయితే ఈ సారి హీరోయిన్గా కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అలా 2025లో మరోసారి టాలీవుడ్ తలుపు తట్టిన భామలు ఎవరు? వారితో ఎంతమంది సక్సెస్ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ లయ..
అప్పట్లో టాలీవుడ్ హీరో శివాజీతో వరుసగా సినిమాలు చేసింది లయ. కొన్ని చిత్రాలు చేసిన ఆమె అమెరికా చెక్కేసింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యూఎస్లోనే సెటిలైంది. కానీ ఈ ఏడాది నితిన్ మూవీ తమ్ముడుతో మరోసారి తెలుగు తెరపై మెరిసింది. అయితే ఈ చిత్రం లయకు పెద్దగా వర్కవుట్ కాలేదు.
మన్ముధుడు అన్షు..
నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రంలో తన అందంతో కట్టిపడేసి హీరోయిన్ అన్షు. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లకే సినిమాలకు గుడ్‌బై చెప్పిన ముద్దుగుమ్మ.. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇటీవల సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా మూవీతో తెలుగు తెరపై మెరిసింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మన్మధుడు బ్యూటీ అన్షుకు రీ ఎంట్రీ అంతగా కలిసి రాలేదు.
బొమ్మరిల్లు జెనీలియా..
బొమ్మరిల్లు మూవీతో ఆడియన్స్ను తనవైపు తిప్పుకున్న బ్యూటీ జెనీలియా. ఆ మూవీ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా.. ఈ ఏడాది జూనియర్ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన జెనీలియాకు అంతగా కలిసి రాలేదు. తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
కామ్నా జెఠ్మలానీ..
2005లో ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కామ్నా జెఠ్మలానీ. ఆ తర్వాత తన మూడో చిత్రం రణంతో బాగా పాపులర్ అయింది. అల్లరి నరేష్‌తో బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించింది. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే నటించింది.
అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన కె-ర్యాంప్ మూవీలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో రీ ఎంట్రీలో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్ 10న జన్మించిన కామ్నా జెఠ్మలానీ.. 2014లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈ ఏడాదిలో ఐదుగురు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వగా.. కేవలం కామ్నా జెఠ్మాలానీనే సక్సెస్ వరించింది. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
నువ్వు నేను ఫేమ్ అనిత..
నువ్వు-నేను చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అనితా చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. సుహాస్ హీరోగా వచ్చిన ఓ భామ అయ్యో రామాలో కనిపించింది. అయితే ఈ మూవీ అనితకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో గట్టిగా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న అనితకు నిరాశే ఎదురైంది. సీనియర్ హీరోయిన్‌ల రీ ఎంట్రీలో హిట్ కొట్టకపోయినప్పటికీ అభిమానుల ఆదరణ దక్కించుకున్నారు.
అంతేకాకుండా టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన చాలా మంది ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. భూమిక, రంభ, మీనా, విజయశాంతి, సంగీత, మీరా జాస్మిన్, సదా లాంటి సీనియర్ హీరోయిన్లు మరోసారి వెండితెరపై మెరిశారు. వీరిలో కొంతమంది మెప్పించారు. మరికొందరేమో ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.


