తెలుగు నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతోంది. అటు ఆరోగ్య సమ్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో దినదినగండంగా బతుకు వెల్లదీస్తోంది. పైసా ఆదాయం లేకపోవడం.. దానికి తోడు ఆదుకునేవారే కరువు అవడంతో ఆమె జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలువురు సాయం చేసినా అది తాత్కాలిక ఉపశమనం కలిగించిందే తప్ప ఆమె బతుకు మాత్రం చక్కబడలేదు.
రోడ్డు మీదకు శ్యామల
గత కొంతకాలంగా శ్యామల.. మంచానికే పరిమితమైన కూతురితో కలిసి ఓ హోమ్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో తాను కూడా కదల్లేని స్థితికి చేరుకుంది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుర్లకు తాము సేవలు చేయలేమంటూ సదరు హోమ్ నిర్వాహకులు వారిద్దరినీ బయటకు పంపినట్లు తెలుస్తోంది. తమను ఆదుకునేవారు లేక నిరాశలో కూరుకుపోయిన శ్యామల.. దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఓ వార్త వైరలవుతోంది.
పోలీస్ సాయంతో..
రోడ్డుపై దయనీయ పరిస్థితిలో ఉన్న వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గమనించి తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి తల్లీకూతుర్లిద్దరినీ ఆర్‌కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్ (స్వచ్చంద సంస్థ)లో చేర్పించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణ.. శ్యామలతో పాటు ఆమె కూతురికి ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించాడు.
ఆదుకోండి
పావల శ్యామల (Pavala Syamala) దాదాపు 300 సినిమాల్లో నటించింది. వెండితెరపై గయ్యాలి గంపగా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను విషం తాగి చావడానికి సిద్ధమే కానీ కూతుర్ని చంపుకోలేకపోతున్నాననంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బుల్లేవని, ఆదుకోమని ఎన్నోసార్లు మొర పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలోనూ ఓ వీడియో రిలీజ్ చేసింది.


