ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా | Venkatesh Trivikram Movie Titled Aadarsha Kutumbam | Sakshi
Sakshi News home page

Venkatesh: త్రివిక్రమ్ మళ్లీ 'ఆ' సెంటిమెంట్.. వెంకీ మూవీ పోస్టర్ రిలీజ్

Dec 10 2025 10:29 AM | Updated on Dec 10 2025 11:00 AM

Venkatesh Trivikram Movie Titled Aadarsha Kutumbam

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోకి టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలా అని వీళ్లు దర్శకుడు-హీరోగా కలిసి పనిచేయలేదు.  త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ హీరోగా చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్‌కి పనిచేశారు. వాటిల్లో కామెడీ గానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి పనిచేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. అది కొన్నాళ్ల ముందు నెరవేరింది.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు అప్‌డేట్ ఇచ్చారు. 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే టైటిల్‌తో 1969లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుని టైటిల్‌గా ఉపయోగిస్తున్నారు. పేరు, పోస్టర్ చూస్తుంటేనే మంచి హోమ్లీ ఫీల్ అనిపిస్తుంది.

ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపిస్తుండగా.. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమా రిలీజైన తర్వాత నుంచి త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనుకున్నారు కానీ తర్వాత ఎన్టీఆర్‌తో ఫిక్స్ అయ్యారు. కుమారస్వామి దేవుడు బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇది తీయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ తీయడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఇంతలో వెంకీతో ఈ సినిమాని త్రివిక్రమ్ తీస్తున్నారు.

ఇకపోతే త్రివిక్రమ్.. ఈ సినిమాతో మరోసారి 'ఆ' సెంటిమెంట్ రిపీట్ చేశారని చెప్పొచ్చు. గతంలో అతడు, అత్తారింటికి దారేది, అఆ, అల వైకుంఠపురములో, అరవింద సమేత.. ఇలా అ లేదా ఆ అక్షరంతో ఎక్కువగా టైటిల్స్ పెట్టారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. ఇప్పుడు తన సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ వెంకీతో తీస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టారా అనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement