ఇది ఫెయిర్ కాదు బిగ్‌బాస్ పేరిట హౌస్‌లో ఇమ్యూనిటీ చాలెంజ్ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్ పూర్తవగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో మరో రెండు గేమ్స్ పెట్టారు. అలాగే బిగ్‌బాస్ ప్రియులు హౌస్‌లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్ 9వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
సంజనాకు సీక్రెట్ టాస్క్
మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.
గేమ్ నుంచి తప్పించే ఛాన్స్
మూడో గేమ్‌లో ఒకరు ఆడకుండా సైడ్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్) కచ్చితంగా మా ఇద్దరి (పవన్, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్, కల్యాణ్ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్ పేరు చెప్తున్నా అంది.

ప్లేటు తిప్పేసిన సంజనా
నువ్వు పవన్ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్ పవన్ పేరు చెప్పింది. పవన్, కల్యాణ్.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్‌లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది.
తనూజ వర్సెస్ సంజనా
పవన్‌కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్ గేమ్ ఆడటానికి వీల్లేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న ఇమ్మూ, పవన్.. గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.
ఇమ్మూ ఓట్ అప్పీల్
వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్ అప్పీల్ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మూడుసార్లు కెప్టెన్ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్ గెల్చుకుంటూ వచ్చాను.
ఓట్ అప్పీల్
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్‌టైనర్ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్‌చాట్ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.


