అమ్మాయి నవ్వు ఎవరైనా బాగుందంటారు. కానీ రీతూ నవ్వు చూడగానే అమ్మో, ఇదేం నవ్వు అని జడుసుకుంటారు. మొదట్లో భయపడ్డా రానురానూ అలవాటైపోయి.. తను అరవడం, ఏడవడం కన్నా నవ్వితేనే బాగుందన్నారు. ఎలాగైనా టాప్ 5లో ఉండాలనుకుంది రీతూ.. కానీ బిగ్‌బాస్ తనను అక్కడివరకు రానివ్వకుండానే అడ్డుకట్ట వేశాడు. 13వ వారంలో ఎలిమినేట్ చేసి పంపాడు. రీతూ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..
మొదట కల్యాణ్.. తర్వాత
రీతూ టామ్ బాయ్‌లా ఉంటుంది. ఆడమగ అన్న తేడా లేకుండా అందరితోనూ కలివిడిగా మాట్లాడుతుంది. మొదట్లో కళ్యాణ్‌తో క్లోజ్‌గా ఉంది. తర్వాత పవన్‌కు దగ్గరైంది. ఈమె ప్రవర్తన చూసి జనాలు కూడా తిట్టుకున్నారు. ఆడటానికి వచ్చిందా? లవ్‌ట్రాకులు పెట్టుకునేందుకు వచ్చిందా? ఇలాంటివాళ్లను పంపించేయడమే మేలు అని అభిప్రాయపడ్డారు. కానీ రీతూ అదంతా కావాలని చేసిందైతే కాదని నెమ్మదిగా జనాలు రియలైజ్ అయ్యారు.
కృత్రిమంగా మొదలైనప్పటికీ..
బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ పెట్టుకుంటే అటెన్షన్, ఫేమ్ వస్తుందని ఆలోచించింది రీతూ (Rithu Chowdary) కాదు, డిమాన్ పవన్. ఈ విషయాన్ని పవన్ కాలేజ్‌మేట్, కంటెస్టెంట్ శ్రీజ కూడా వెల్లడించింది. అలా మొదట్లో వీరి ట్రాక్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నా రానురానూ వాళ్లిద్దరికీ తెలియకుండానే మరింత క్లోజ్ అయ్యారు. ఒకరికోసం ఒకరు నిలబడ్డ ప్రతిసారి హౌస్‌మేట్స్ టార్గెట్ చేసి మాటలనేవారు. అప్పుడు కూడా పవన్ కంటే రీతూయే ఎక్కువ స్టాండ్ తీసుకునేది.
ఇలాగే ఉంటా!
ఫైర్‌స్ట్రామ్‌గా వచ్చిన మాధురి అయితే మీది అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ అని ముద్రేసింది. సంజనా అయితే.. అలా ఇద్దరూ అతుక్కుపోవడం చూడటానికి బాగోలేదు అంది. అయినా సరే రీతూ వెనక్కు తగ్గలేదు. తన స్నేహం చూసేవాళ్లకు తప్పుగా అనిపిస్తే తానేం చేయలేననంది. ఇక్కడ జనాలకు ఆ అమ్మాయి నచ్చేసింది. ఎవరైనా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారనగానే కచ్చితంగా తమ తీరును ఎంతోకొంత మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ రీతూ అలాంటిదేం చేయలేదు. నేనింతే అంటూ మనసుకు నచ్చిందే చేసింది. పవన్ కోసం నిలబడింది. అలా తన లవ్ ట్రాక్.. తనకు కొంత ప్లస్ అయితే మరికొంత మైనస్ అయింది.
తనపై తనకు నమ్మకం తక్కువ
టికెట్ టు ఫినాలేలో బాగానే ఆడింది కానీ మొదటి నుంచి గేమ్‌లో పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. మొదటి నుంచి తనను తాను నమ్మకుండా అవతలివారిపైనే ఎక్కువ ఆధారపడింది. ఆత్మవిశ్వాసం పక్కనపెట్టి అందరినీ బతిమాలుకోవడం చూసేవారికి నచ్చలేదు. ఇకపోతే టికెట్ టు ఫినాలేలో సుమన్ కూడా బాగా ఆడాడు. దీంతో అతడి ఓటింగ్ పెరగడం రీతూకి మైనస్ అయింది. నిజానికి సుమన్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఫిక్సయ్యారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతడి ప్రభంజనానికి రీతూ బలైపోయింది!


