మూడు రోజులుగా దేశ వైమానిక రంగంలోసంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్ అయ్యింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణ వాయిదాల నివారణకు తగిన ప్రత్యామ్నాయలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ ను ఆలస్యం చెయవద్దని వారికి రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల వేలాది మంది ఇబ్బందులు పడుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపింది.
ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంస్థకు ఏమాత్రం పట్టడం లేదని దానిని కనీసం లెక్కచేయడం లేదని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర విమానయాన శాాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఇండిగో సంస్థ ప్రకటించింది. అయితే ఆ రూల్స్ ని డీజీసీఏ తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు.
ప్రయాణికులకు విమానాలు రద్దైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇండిగో సంస్థ కావాలనే వారికి ఈ సమాచారం అందించలేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్తరూల్స్ వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండిగో సంస్థ కావాలనే ఈ కృత్తిమ సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు వస్తున్నాయి.


