న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు సుదూర ప్రయాణాలలో కొత్త అనుభవాన్ని అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. వేగవంతమైన తేజస్, సౌకర్యవంతమైన రాజధాని, వందే భారత్‌లోని అధునాతన సాంకేతికతల కలబోతగా మనముందుకు ‘వందేభారత్ స్లీపర్’ రానుంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ-పట్నా మార్గంలో నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంల్) ఫ్యాక్టరీలో తయారవుతున్న వందే భారత్ స్లీపర్ రెండు రేక్‌లలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. మొదటి రేక్ డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు బయలుదేరి, ఆ తర్వాత ఢిల్లీ-పట్నా మార్గంలో ట్రయల్ రన్‌కు సిద్ధం కానుంది. ఈ హైటెక్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 827 బెర్త్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీలో 611 బెర్త్‌లు, సెకండ్ ఏసీలో 188 బెర్త్‌లు, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి. భవిష్యత్తులో కోచ్‌ల సంఖ్యను 24కి పెంచే అవకాశం కూడా ఉంది.
వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేయనుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీలో సౌకర్యవంతమైన ఇంటీరియర్లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. అంతేకాకుండా దీనిలో ‘కవచ్ సిస్టమ్’ (రైలు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ), క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ లాంటి అధునాతన భద్రతా సాంకేతికతలు కూడా ఉన్నాయి.
వందేభారత్ స్లీపర్ వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుండి రైలు సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోనుంది. ఈ నెలాఖరు నాటికి రైలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు దానాపూర్ డివిజన్ కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు రాకపోకలు ప్రారంభిస్తే పట్నా-ఢిల్లీ మార్గంలోని ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి: 87 ఏళ్ల క్రితం ‘జై భీమ్’ పుట్టిందిలా..


