పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..
చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్‌స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.
చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్‌లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.
అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్..
లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్‌హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.
పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు.


