అయోధ్య: దేశ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా నిలిచిన బాబ్రీ మసీదు కూల్చివేత 33వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యతో పాటు ఇతర సున్నిత ప్రాంతాలలో భద్రతా దళాలను హై అలర్ట్‌లో ఉంచారు. అయోధ్య నగరం అసాధారణమైన భద్రతా పహారా కింద ఉంది. స్థానిక పోలీసులు ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలను నిర్వహిస్తూ, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి ఏటా డిసెంబర్ 6న అయోధ్యలో భద్రతను పటిష్టం చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియగా మారింది. అయితే ఈ ఏడాది మరింత అప్రమత్తత కనిపిస్తోంది. అయోధ్యలో భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) చక్రపాణి త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, హోటళ్లు, ధర్మశాలల్లో బస చేసిన సందర్శకుల రికార్డులను తనిఖీ చేస్తున్నామన్నారు. నగరంలో వాహనాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని, తమ బృందాలు ఘాట్‌లు, ఇతర ప్రాంతాలలో కూడా గస్తీ తిరుగుతున్నాయని తెలిపారు.
భద్రతా తనిఖీలు, నిఘా, జనసమూహ నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను మోహరించినట్లు చక్రపాణి త్రిపాఠి తెలిపారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్థానిక యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉన్నదన్నారు. కాగా చారిత్రక నగరమైన వారణాసిలో కూడా భద్రతను గణనీయంగా కట్టుదిట్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరవణన్ తగమాని మాట్లాడుతూ, వారణాసి కమిషనరేట్‌లోని తమ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. నగరం అంతటా తనిఖీలు జరుగుతున్నాయని, వారణాసి జంక్షన్, బనారస్ రైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.
84 ఘాట్‌లలో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని, ముఖ్యంగా అస్సీ ఘాట్, నమో ఘాట్, దశాశ్వమేధ ఘాట్‌లలో సాయంత్రం హారతి సమయంలో ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదన్నారు. కాగా 1992, డిసెంబర్ 6న కర సేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేయడం దేశంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతర హింస, ముస్లిం నివాసాలపై దాడులు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసింది. పలు హింసాయుత ఘటనల్లో వెయ్యి మందికి పైగా జనం మృతిచెందారు.
ఇది కూడా చదవండి: సంక్షోభం వేళ.. ఇండిగో యజమానిపై ఆరా!


