ధ్వజారోహణ తర్వాత ప్రధాని మోదీ ఉద్ఘాటన
అయోధ్య: ఐదు వందల సంవత్సరాల రామమందిర సాధనా సమరంలో భారతీయులకు తగిలిన గాయాలు నేడు ఆలయ నిర్మాణంతో మానిపోయాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మంగళవారం భవ్యరామ మందిర ప్రధాన శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన సందర్భంగా శ్రీరామ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వేలాది మంది భక్తులనుద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. జైశ్రీరాం నినాదంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ‘‘ నేడు భారత్‌సహా యావత్ ప్రపంచం రామస్మరణ చేస్తోంది. ఆలయ నిర్మాణం సంపూర్ణమవడంతో భారతీయుల శతాబ్దాల నాటి గాయాలు నేటితో మానిపోయాయి. భక్తుల వందల ఏళ్ల బాధాగ్ని చల్లారింది. ఇప్పుడు ప్రతి ఒక్క రామభక్తుడి మదిలో అనిర్వచనీయ ఆనందం ఉప్పొంగుతోంది.
ధ్వజారోహణం నిజంగా అపూర్వం, అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఘటన. కాషాయ జెండాలో సూర్యవంశ కీర్తి దాగిఉంది. కోవిద వృక్షం రామరాజ్య వైభవాన్ని చాటుతోంది. ఇది కేవలం మతసంబంధ జెండా కాదు. భారతీయ నాగరికతా జెండా. ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ జెండా అసత్యాలపై సత్యం విజయం శాశ్వతమని సగర్వంగా అంతెత్తున నిలిచి చాటిచెప్పే జెండా ఇది. ఆలయ నిర్మాణానికి అవిశ్రాంత కృషిచేసి తమ వంతు సాయమందించిన ప్రతి ఒక్క రామభక్తునికి నా మనస్ఫూరక కృతజ్ఞతలు. ఆనాడు శ్రీరాముడు అయోధ్యను యువరాజుగా వదిలివెళ్లాడు. తిరిగొచ్చేటప్పుడు మర్యాద పురుషోత్తమునిగా ఎదిగి వచ్చాడు.
వశిష్టుడు వంటి రుషుల జ్ఞానసంపద, గురువుల మార్గనిర్దేశనం, నిశదరాజు వంటి స్నేహితుల సాంగత్యం, శబరి అవ్యాజమైన భక్తి, హనుమంతుని అచంచల భక్తి ఇలా అందరూ ఆ దశరథ తనయుడిని సర్వగుణసంపన్నుడిగా తీర్చిదిద్దారు. భారత్ అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే సమాజంలోనూ ఇలాంటి సమష్టి కృషి అవసరం. ప్రస్తుత తరాలకే కాదు భావితరాల అవసరాలు తీర్చేలా భారత్ పునర్‌నిర్మాణం జరగాలి. ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లే. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదిగే క్రమంలో రాముడు సైతం మనకు అండగా నిలబడ్డాడని అనిపిస్తోంది. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. క్రమశిక్షణ, దార్శనికత, విలువలు మూర్తీభవించిన శక్తి’’ అని మోదీ అన్నారు.
మార్పు తరుణం ఆసన్నమైంది...
‘‘ఆధునిక నాగరిక సమాజంలో భారత్ ఇకపై తనదైన గుర్తింపును సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. బానస మనస్తత్వాన్ని భారత్ వదిలించుకోవాలి. 190 ఏళ్ల క్రితం మనలో మెకాలే ఒక బానిస మనస్తత్వ విషబీజాలను విజయవంతంగా నాటి విస్తృతపరిచాడు. భారతీయ సమాజ విలువల్ని కూకటివేళ్లతో పెకలించే కుట్ర అది. మనం బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రమైతే సాధించాంగానీ బానిసత్వపు ఆలోచనల నుంచి స్వాతంత్య్రం సాధించలేకపోయాం. ఇకనైనా వచ్చే పదేళ్లలోపు ఈ మానసిక బానిసత్వపు బంధనాలను తెంచుకుందాం.
విదేశాల తరహాలో ప్రజాస్వామ్యం కోసం భారత్ పోరాడిందన్న వలసపాలకుల వాదనల్లో నిజం లేదు. ప్రజాస్వామ్యం అనేది వేల సంవత్సరాల క్రితమే భారతీయ డీఎన్‌ఏలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులోని 1,000 సంవత్సరాల క్రితంనాటి ఉత్తర మేరూర్ గ్రామ శాసనంలో ప్రజాస్వామ్య ప్రస్తావన ఉంది. వలసపాలకులు మన జాతీయ గుర్తులను సైతం ప్రభావితంచేశారు. పరాయి పాలనకు చరమగీతం పాడుతూ ఇటీవలే నేవీ చిహ్నాన్ని సైతం రీడిజైన్ చేశాం. ఇది డిజైన్ మార్పు మాత్రమేకాదు ఆలోచనా మార్పు’’ అని మోదీ అన్నారు.
అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది...
‘‘త్రేతాయుగంలోనే అయోధ్య మానవాళికి నైతిక విలువల్ని ప్రసాదించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన రైల్వేస్టేషన్, అనుసంధానతతో అదే అయోధ్య మనకు అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది. నేడు అయోధ్య ప్రాచీనత, ఆధునికతల కలబోతగా కొత్త కళను సంతరించుకుంది. భవిష్యత్తులోనూ పురాతన, నూతనత్వాల సంగమ స్థిలిగా భాసిల్లుతుంది. ఇక్కడి సరయూ జలాల్లో అమృతంతోపాటు అభివృద్ది కలిసి ప్రవహిస్తాయి. ప్రాణప్రతిష్ట పనులు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా అయోధ్యను 45 కోట్లమంది దేశ, విదేశీ భక్తులు సందర్శించారు. ఇది ఆర్థిక రూపాంతరీకరణకు నిదర్శనం’’ అని మోదీ అన్నారు.
వాళ్ల ఆత్మలకు శాంతి: భాగవత్
అయోధ్య రామాలయం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ల ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘‘అవిశ్రాంత పోరాటం, అలుపెరగని కృషి, లెక్కలేని త్యాగాలకు నేడు సార్థకత చేకూరింది. ఈ రోజు మనకెంతో ప్రత్యేకం. అశోక్ సింఘాల్, మహంత్ రామచంద్ర దాస్, దాల్మియా, వేలాది మంది రుషులు, లక్షలాది కుటుంబాలు, విద్యార్థులు, ఎంతో మంది భక్తుల త్యాగాలకు ఫలితం లభించింది. ఈ మధుర ఘట్టాన్ని చూడాలని పరితపించిన వాళ్ల కల నెరవేరింది. జెండాను మాత్రమే కాదు మరెన్నో ప్రాథమిక విలువలను మరింత ఎత్తులో నిలబెట్టాం. వ్యక్తులు, కుటుంబం మొదలు దేశం, ప్రపంచం దాకా ఈ విలువలే అందరికీ దిశానిర్దేశంచేస్తాయి. అందరి సంక్షేమాన్ని కాంక్షించడమే ధర్మం. కాషాయ రంగు ధర్మానికి గుర్తు. అందుకే ఇది ధర్మధ్వజం అయింది’’ అని అన్నారు.
కొత్త అధ్యాయానికి ఆరంభం: యోగి
‘‘ధర్మధ్వజారోహణతో ధర్మమనేది కాంతి ఇకపై నేల నలుచెరుగులా వ్యాపించనుంది. ఇది కొత్తఅధ్యాయానికి అంకురార్పణ’’ అని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అన్నారు.


