న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన 3 వేల మందికిపైగా యువజనులతో ముఖాముఖి సమావేశం జరపనున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్(వీబీ)–యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం జరగనుంది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా పలువురు పాల్గొంటున్నారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) శనివారం తెలిపింది.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 12న జరిగే కార్యక్రమంలో ఎంపికైన యువ నేతలు 10 విభిన్న ఇతివృత్తాలకు సంబంధించిన తమ తుది ప్రజెంటేషన్లను ప్రధాని మోదీకి సమరి్పస్తారు. దేశాభివృద్ధికి సంబంధించి యువత దృక్పథం, వారి వినూత్న ఆలోచనలు, అమలు చేయదగ్గ ప్రణాళికలను నేరుగా ప్రధానితో పంచుకుంటారు. అనంతరం ప్రధాని ’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026’ వ్యాస సంకలనాన్ని విడుదల చేస్తారు.


