ఎల్‌పీజీ సంక్షోభంపై రాజ్యసభలో రచ్చ
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ధ్వజం
ఖర్గేపై ఎదురుదాడికి దిగిన జేపీ నడ్డా
న్యూఢిల్లీ: ఇరాన్ వార్‌తో దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్‌పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్‌పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్‌పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్‌పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్‌పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్‌పిజి కొరత లేదని లోక్‌సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.
దేశవ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్‌లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్‌పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.
దేశంలో 60 శాతం ఎల్‌పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్‌పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.
అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్‌పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.
నడ్డా కౌంటర్
ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాల ఆందోళన
అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.


