ఎల్పీజీ సిలిండర్ వేగవంత డెలివరీపై గృహిణి సంతోషం
ప్రధాని మోదీకి లేఖ
ప్రతిస్పందించిన ప్రధాని
లఖీంపూర్ ఖేరీ(యూపీ): గతంతో పోలిస్తే నేడు ఆన్‌లైన్ బుకింగ్ వంటి సౌకర్యాలకారణంగా వంటగ్యాస్ సిలిండర్‌ను కేవలం 15 నిమిషా ల్లోనే ఇంటి వద్ద డెలివరీ తీసుకోగలిగానని ప్రధాని మోదీకి ఒక గృహిణి తన అమితానందాన్ని ఒక లేఖ ద్వారా వ్యక్తంచేశారు. ఈ వివరాలను శనివారం ప్రధాని మోదీ స్వయంగా అందరితో పంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర ప్రదే శ్‌లోని లఖీంపూర్ పట్టణానికి చెందిన అరుణశ్రీ డాన్ బాస్కో స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. గత ఏడాది డిసెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేయగా కేవలం 15 నిమిషాల్లో డెలివరీ బాయ్ సిలిండర్‌ను ఇంటి వద్దకు పట్టుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘‘ ఆనందం, ఉద్వేగంతో ప్రధానికి లేఖ రాశా. జీవితాలను ఇంత సులభతరంగా మార్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపా.
నా చిన్నతనంలో ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలన్నా, సిలిండర్ మార్చుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఆకాలం పోయి ఒక్క ఫోన్‌కాల్‌తో సిలిండర్ ఇంటి వద్దే ప్రత్యక్షమవుతోంది. ఈ ఘనత ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానిదే’’ అని ఆమె అన్నారు. లేఖపై మోదీ స్పందించారు. మహిళా సాధికారత కోసం తామెన్నో కేంద్ర పథకాలను అమలుచేస్తున్నామని మోదీ గుర్తుచేశారు.


