బీఆర్‌ నాయుడు భయంకర స్త్రీలోలుడు | BR Naidu Victim Sensational Letter Release: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడు భయంకర స్త్రీలోలుడు

Mar 3 2026 4:06 AM | Updated on Mar 3 2026 4:08 AM

BR Naidu Victim Sensational Letter Release: Andhra pradesh

మహిళతో సన్నిహితంగా బీఆర్‌ నాయుడు

సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన

ఆ వీడియోలు, ఫొటోలు ఒరిజినల్‌ అని నిర్ధారించిన ఏఐ సంస్థ 

బీఆర్‌ నాయుడికి వావివరసలు లేవు

మహిళలు చిన్న పనికోసం వచ్చినా ఇబ్బంది పెడతారు 

తాను టీడీపీ అభిమాని కావడంతోనే ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భయంకరమైన స్త్రీలోలుడంటూ ఓ బాధిత మ­హిళ సీఎం చంద్రబాబుకు రాసి­న లేఖను టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధి­కార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి బహిర్గతం చేశారు. ‘బీఆర్‌ నా­యుడు వావివరసలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తికి అత్యున్నత పదవి ఇస్తే.. మహిళలు చిన్న పనికోసం వచ్చినా వా­రిని ఇబ్బంది పెడతారు. అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. నేను టీడీపీ అభిమానిని కావడంతో నాయుడిని రో­డ్డు­న పడేయడం ఇష్టం లేక ఫిర్యాదు చేయలేదు..’ అంటూ లేఖ­లో బాధిత మహిళ ఆక్రోశించిందని భూమన తెలిపారు.

30 ఏళ్లుగా తమ మధ్య అనుబంధం ఉందని బీఆర్‌ నా­యు­డు చెబుతున్న మహిళ 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశా­రని తెలిపారు. బీఆర్‌ నాయుడితో సంబంధాల గు­రించి అందులో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పా­రు. ఫొటో­లు, వీడియోల వంటి ఆధారాలతో అడ్డంగా దొరికినా మారి్ఫంగ్‌ అంటూ బీఆర్‌ నాయుడు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆ వీడియోలన్నీ ఒరిజినల్‌వేనని ధ్రువీకరిస్తూ ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ సంస్థలు ఇచ్చిన నివేదికను భూమన మీడియాకు ప్రదర్శించారు. సోమవా­రం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మేయర్‌ డాక్ట­ర్‌ శిరీష, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో కలిసి భూమన విలేకరులతో మాట్లాడారు.   

దబాయించి కల్లబోల్లి కబుర్లు.. 
‘బీఆర్‌ నాయుడి అనైతిక ప్రవర్తన, అసభ్య వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపర్చాయి. అలాంటి వ్యక్తిని ఇంకా టీటీడీ చైర్మన్‌గా కొనసాగించడం అంటే సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామిని అవమానించడమే. బీఆర్‌ నాయుడుకు ఏమాత్రం సిగ్గు, నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే చంద్రబాబునాయుడే ఆయన్ను పదవి నుంచి తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలి. తొలుత తన ఫొటోలు, వీడియోలు మారి్ఫంగ్‌ చేశారని దబాయించిన బీఆర్‌ నాయుడు... తర్వాత మాట మార్చి తమ రెండు కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా అనుబంధం ఉందని కల్లబోల్లి కబుర్లు చెప్పారు. దుర్యోధనుడి కంటే అహంకారంగా మాట్లాడుతూ నన్ను, మా నాయకుడిని ఏకవచనంతో సంబోధించారు. అటువంటి వ్యక్తి గురించి ఆలోచించడం ఇష్టం లేకే మేం ఆ భాష మాట్లాడటం లేదు. 1974లోనే నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును ధైర్యంగా నిలదీసి కరపత్రం అందించిన వ్యక్తిని నేను’ అని చెప్పారు. 

నాయుడూ..! ఇదీ నీ బతుకు.. 
‘బీఆర్‌ నాయుడూ.. నీ బతుకు ఇదీ..! పశువు కంటే హీనమైన వ్యక్తివి. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేస్తున్న నీచుడివి నువ్వు. లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదంటే.. ఆయన కూడా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నీచుడికి టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చారనిపిస్తోంది. తగ్గేది లేదంటున్నావు. నీ లాంటి వాళ్లను మనిషిగా కూడా మేం భావించడం లేదు. నేను నీ దగ్గరకి వచ్చానని అబద్ధాలు చెబుతున్నావ్‌. నీ అక్రమ వ్యాపారాలు, అక్రమ సంపాదన గురించి అందరికీ తెలుసు. భగవద్గీత పుస్తకాల ప్రచురణలో రూ.50 కోట్లు మింగేశారంటూ బోర్డు సమావేశంలో విసిరేసినట్లు తెలుస్తోంది.

నేను ముందుమాట రాశానని ఆ పుస్తకాలను విరిసికొట్టాడట! నీకు అసలు భగవద్గీత విలు­వ తెలుసా? కృష్ణ భగవానుడి భగవద్గీతను ఐదు భాషల్లో ప్రచురిస్తే ఛీ భగవద్గీత అంటావా? టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనే సీనియర్‌ అసిస్టెంట్‌ను వివాహేతర సంబంధం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. గతంలో ఎస్వీబీసీ భక్తి చానల్‌ చైర్మన్‌గా ఉన్న నటుడు పృధ్వీరాజ్‌పై ఆరోపణలు వస్తే నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన్ను తక్షణమే తొలగించారు’ అని భూమన తెలిపారు.   

పచ్చ మీడియా రచ్చపై భూమన ప్రెస్‌నోట్‌... 
బీఆర్‌ నాయుడు బాధిత మహిళ లేఖ రాసిన సంవత్సరానికి సంబంధించి టీడీపీ సోషల్‌ మీడియాలో చేస్తున్న రచ్చ, ట్రోలింగ్‌పై స్పందిస్తూ భూమన అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ నాయుడు తనను ఎలా వంచించాడో వివరిస్తూ చంద్రబాబు తదితరులకు బాధిత మహిళ లేఖలు రాయడం వాస్తవమని గుర్తు చేశారు. టీడీపీ అనుకూల సోషల్‌ మీడియా ఇకనైనా తనను విమర్శించటాన్ని ఆపాలని సూచించారు.

బీఆర్‌ నాయుడు బాధిత మహిళ లేఖ ఇదీ..! 
‘‘మేం 36 ఏళ్ల క్రితం తెనాలి నుంచి వచ్చి హైదరాబాద్‌ మణికొండలో నివాసం ఉంటున్నాం. నాకు బీఆర్‌ నాయుడుతో 25 సంవత్సరాలుగా ఉన్న పరిచయం రిలేషన్‌గా మారింది. మా ప్రయాణంలో బీఆర్‌ నాయుడి వల్ల నాకు సుఖం, సంతోషం లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డా. కేవలం తన అవసరాల కోసమే నాతో రిలేషన్‌లో ఉంటున్నారన్న విషయం అర్థం కావడానికి నాకు కొన్ని ఏళ్లు పట్టింది. నాకు 16 ఏళ్ల కుమార్తె కూడా ఉంది.

బీఆర్‌ నాయుడితో నా సంబంధం మొదలైన తర్వాత నా కుమార్తెకు ఆటో ఇమ్యునో డిసీజ్‌ (ఎస్‌ఎల్‌ఇ) వచ్చింది. ఇప్పుడు నా కుమార్తె జీవన్మరణ పోరాటం చేస్తోంది. బీఆర్‌ నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, బూతులు తిడుతూ నీకు తాళి కట్టానా? అని పదే పదే ప్రశ్నిస్తూ నన్ను నీచంగా చూస్తున్నారు. ఇన్నాళ్లూ బాధలు భరిస్తూ వచ్చా. నేను టీడీపీ అభిమానిని కావడంతో నాయుడిని రోడ్డున పడేయడం ఇష్టం లేక ఫిర్యాదు చేయలేదు. ఈ ఉత్తరంలో నేను రాసిన ప్రతి అక్షరానికి కట్టుబడి ఉన్నా..’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement