‘బాబూ.. అగ్రి గోల్డ్‌ బాధితుల ఆర్తనాదాలు వినండి’ | Agri Gold Victims Protest in Vijayawada Dharna Chowk: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘బాబూ.. అగ్రి గోల్డ్‌ బాధితుల ఆర్తనాదాలు వినండి’

Mar 3 2026 3:37 AM | Updated on Mar 3 2026 3:38 AM

Agri Gold Victims Protest in Vijayawada Dharna Chowk: Andhra pradesh

రిలే దీక్షలో మాట్లాడుతున్న అసోసియేషన్‌ నాయకులు

రిలే దీక్షల ప్రారంభ సభలో వక్తల డిమాండ్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అగ్రి గోల్డ్‌ బాధితుల ఆర్తనాదాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవాలని, బాధితులకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు స్పష్టమైన చర్యలు చేపట్టాలని వక్తలు కోరారు. విజయవాడ ధర్నాచౌక్‌లో అగ్రి గోల్డ్‌ బాధితుల రిలే దీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రి గోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు.

కంపెనీ చైర్మన్‌ అవ్వా సీతారామారావు, వారి సోదరుల కుటుంబ సభ్యుల పేరిట గల ఆస్తులను కూడా తక్షణమే జప్తు చేయాలని కోరారు. అగ్రి గోల్డ్‌ ఆస్తులను వేలం వేసి నిలువునా మోసపోయిన బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఓట్లను అభ్యర్ధించే సమయంలో ఇంటింటా ప్రచారం చేసిన కూటమి నేతలు అగ్రి గోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఆ హామీలను అమలు చేయకుండా 20 నెలలుగా సీఎం చంద్రబాబు మౌనం వహించడం బాధ్యతారాహిత్యమేనన్నారు. అగ్రి గోల్డ్‌ బాధితుల నిరవధిక దీక్షలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉప ప్రధాన కార్యదర్శి బి.చంద్రశేఖర్, అసోసియేషన్‌ నాయకులు రామదాసు, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, వెంకటేశ్వర్లు మాట్లాడారు. తొలి రోజు రిలే దీక్షలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement