బ్రహ్మలోకానికి వెళ్లిన హనుమ | Funday Story | Sakshi
Sakshi News home page

బ్రహ్మలోకానికి వెళ్లిన హనుమ

Jan 11 2026 11:47 AM | Updated on Jan 11 2026 11:47 AM

Funday Story

రామ రావణ యుద్ధం ముగిసింది. సుగ్రీవాది వానర ప్రముఖుల సమక్షంలో విభీషణుడిని లంకా«ధిపతిగా రాముడు పట్టాభిషేకం జరిపించాడు. విభీషణుడి అతిథి మర్యాదలు పొందిన తర్వాత రాముడు అయోధ్యకు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. రాముడి ప్రయాణం కోసం విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేయించాడు. సీతా లక్ష్మణ సమేతంగా రాముడు పుష్పకంలోకి అడుగుపెట్టాడు. ఎందరు ఎక్కినా మరొకరికి చోటు మిగిలి ఉండే పుష్పక విమానంలో తమతో పాటు విభీషణుడిని, సుగ్రీవాది వానర వీరులను కూడా రమ్మని రాముడు ఆహ్వానించాడు. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు సహా వానర వీరులంతా పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. విమానంలోకి అందరూ వచ్చారో లేరోనని రాముడు ఒక్కొక్కరినీ పరికించి చూశాడు. వానర వీరుల్లో గంధమాదనుడు కనిపించలేదు.

‘గంధమాదనుడు ఏడీ?’ అడిగాడు రాముడు.‘యుద్ధంలో కుంభకర్ణుడి చేతిలో మరణించాడు’ బదులిచ్చాడు విభీషణుడు.‘అయ్యో! నాకు సహాయం చేయడానికి వచ్చి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడా? ఈ దురవస్థను తప్పించేవారే లేరా?’ అని రాముడు ఎంతో విచారించాడు. ‘మన హనుమ చెంతనుండగా దిగులు ఎందుకు స్వామీ’ అన్నాడు జాంబవంతుడు.రాముడు వెంటనే హనుమంతుడిని చెంతకు పిలిచి, ‘హనుమా! గంధమాదనుడు ఏ లోకంలో ఉన్నా, తీసుకురా! ఈ పని నీ ఒక్కడికే సాధ్యం’ అన్నాడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ! గంధమాదనుడు ఎక్కడ ఉన్నా, వెదికి నీ ముందుకు తీసుకొస్తా’ అంటూ హనుమ శరీరాన్ని భారీగా పెంచాడు. ఆకాశాన్ని ఆవరించుకున్న ఇంద్రధనుస్సులా తోకను పెంచాడు. నేలను పాదాలతో తాటించాడు. హనుమ పదఘట్టనలకు నేల కంపించింది. ఒక్కసారిగా హూంకరించి, నింగికెగశాడు హనుమ.

 నేరుగా యమపురికి చేరుకుని, యముడి కోట ద్వారం వద్ద నిలబడి భీకరంగా సింహనాదం చేశాడు. హనుమంతుడి సింహనాదానికి యముడి సింహాసనం అదిరిపడింది. యముడు క్షణకాలం భయకంపితుడయ్యాడు. పరుగు పరుగున బయటకు వచ్చి, హనుమ ఎదుట నిలిచి, అతడికి సగౌరవంగా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, లోనికి తీసుకువెళ్లి, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు.‘హనుమా! నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు యముడు. ‘రామ రావణ సంగ్రామంలో మరణించిన మా వానరయోధుడు గంధమాదనుడిని నాతో పంపాలి’ అన్నాడు.‘గంధమాదనుడు నా లోకంలో లేడయ్యా! యుద్ధంలో వీరమరణం పొందాక అతడు సత్యలోకానికి చేరుకున్నాడు!’ చెప్పాడు యముడు.

యముడి వద్ద సెలవు తీసుకుని, హనుమంతుడు నేరుగా సత్యలోకానికి వెళ్లాడు. సత్యలోకంలో హనుమంతుడు బ్రహ్మదేవుడి సభామంటపానికి చేరుకునే సరికి అక్కడ ద్వాదశాదిత్యులు ముకుళిత హస్తాలతో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తూ నిలుచున్నారు. నారదుడు మహతి మీటుతుండగా, మునీశ్వరులు సృష్టికర్త కీర్తిగానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. సరస్వతీ సమేతంగా బ్రహ్మదేవుడు పద్మాసనంపై ఆసీనుడై ప్రసన్నవదనంతో అంతా తిలకిస్తూ ఉన్నాడు. సభా మంటపంలోకి హనుమంతుడు అకస్మాత్తుగా వచ్చేసరికి అందరూ అతడివైపు చూశారు. హనుమ వినయంగా బ్రహ్మదేవుడికి మొక్కాడు. ‘హనుమా! నీ రాక నాకు సంతోషం కలిగించింది. ఇంతకూ నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు బ్రహ్మదేవుడు.

‘తాతా! నీకు తెలియనిదేమున్నది? రామ రావణ సంగ్రామంలో వీరమరణం చెందిన మా వానర యోధుడు గంధమాదనుడు నీ లోకంలోనే ఉన్నాడు. అతడిని వెంటబెట్టుకు రావాలని రామాజ్ఞ! అతడు లేకుండా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరేది లేదని, అతడిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి రాముడు నన్ను పంపాడు. అందువల్ల మా గంధమాదనుడిని నాతో పంపు’ అని చెప్పాడు హనుమంతుడు. ‘హనుమా! రామ కార్యార్థమై యుద్ధంలో శరీరత్యాగం చేసిన గంధమాదనుడు అమరుడయ్యాడు. అతడిని తిరిగి భూలోకానికి పంపకూడదు. 

అయినా, తనువుడిగిన వానిని తిరిగి తెస్తానని ప్రతినపట్టి మరీ చెల్లించుకోవడం నీకే చెల్లింది. రామాజ్ఞ అని నువ్వు చెబుతున్నావు కనుక కాదనేది ఏముంది?’ అని హనుమంతుడిని పొగిడి, గంధమాదనుడిని అతడితో పంపాడు బ్రహ్మదేవుడు.గంధమాదనుడిని తీసుకుని హనుమంతుడు నేరుగా పుష్పకవిమానంలో ఉన్న రాముడి వద్దకు చేరుకున్నాడు. రాముడు హనుమంతుడిని, గంధమాదనుడిని ఆలింగనం చేసుకున్నాడు. గంధమాదనుడి యోగక్షేమాలను కనుక్కున్నాడు. గంధమాదనుడి రాకతో కపివీరులందరూ సంతోషించారు. పుష్పక విమానం అయోధ్యకు బయలుదేరింది.
∙సాంఖ్యాయన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement