బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్‌లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌పై నుంచి సినిమా రేంజ్‌లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.
ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్‌ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


