పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు | Pakistani Drone Enters Indias LoC, Army Opens Fire To Shoot It Down, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు

Mar 1 2026 12:13 PM | Updated on Mar 1 2026 12:36 PM

Pakistani Drone Enters Indias LoC Army Opens Fire to Shoot It Down

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోమారు తన కవ్వింపు చర్యలను ప్రదర్శించింది. ఆదివారం  పూంచ్‌ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక అనుమానాస్పద డ్రోన్‌ భారత గగనతలంలోకి చొరబడటంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్‌ల వద్ద పహారా కాస్తున్న సైనికులు  ఆకాశంలో డ్రోన్‌ అసాధారణ కదలికలను గుర్తించారు. అది పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్‌గా నిర్ధారించుకున్న వెంటనే సైన్యం దాన్ని కూల్చివేసేందుకు పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. 

భారత బలగాల కాల్పుల ధాటికి తాళలేక ఆ డ్రోన్‌ వెంటనే తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 27న కూడా పూంచ్‌ సెక్టార్‌లోనే సరిహద్దు రేఖ వెంబడి ఒక డ్రోన్ కనిపించగా, అప్పుడు కూడా భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది.

వరుసగా డ్రోన్లు చొరబడుతుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించాయి. ఈ డ్రోన్ చొరబాటు వెనుక భారత భూభాగంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను చేరవేసే కుట్ర ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా తాజా ఘటనలో డ్రోన్ ద్వారా ఏవైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచారా అనే కోణంలో అణువణువూ గాలిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సరిహద్దుల వెంబడి భారత్ తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది.
 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement