పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్ట్‌లు లక్ష్యంగా పరస్పరం దాడులు చేసుకున్నాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీకి పెద్దగా యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం. కానీ, పాక్ ఆర్మీ అమ్ముల పొదిలో వందలాది ఫైటర్ జెట్స్ ఉన్న కారణంగా బార్డర్‌లో సైనిక ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలం, ఆయుధ సంపత్తిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఆయుధాలు, అధునాతన సాంకేతిక విషయంలో ఆఫ్ఘనిస్థాన్ కంటే పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. కాగా, 2021 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వానికి చాలా దేశాల నుంచి గుర్తింపు లభించలేదు. ఆయుధాల సంగతిని అలా ఉంచితే, తాలిబన్లకు కనీసం అప్పులు ఇవ్వడానికీ ఏ దేశాలూ ముందుకు రావడం లేదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై రష్యా సేనలు, అమెరికా సేనలు సైనిక స్థావరాలను నిర్వహించాయి. అవి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో కొన్ని యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రైఫిల్స్, ఫిరంగులను వదిలి వెళ్లాయి. ఇప్పుడు వీటినే తాలిబన్ ఆర్మీ వినియోగిస్తోంది. ప్రస్తుతం అవన్నీ మరమ్మతు దశలో ఉన్నట్టు తెలిస్తోంది.
మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం ఆయుధాల విషయంలో బలంగానే కనిపిస్తోంది. చైనా నుంచి పాక్‌కు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. అటు అమెరికా నుంచి ఆయుధాలు సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పాక్ తన ఆయుధాలను పాక్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ మేరకు లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటాను వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాక్‌ను తాలిబన్లు సైనికంగా దీర్ఘకాలం పాటు ఎదుర్కోవడం కష్టమేనని చెప్పుకొచ్చింది.
ఇరు దేశాల సైనిక శక్తి ఇలా..
పాకిస్తాన్..
సైనిక శక్తిపరంగా ప్రపంచంలో పాకిస్థాన్‌కు 14 స్థానంలో(145 దేశాలకు గాను) ఉంది.పాక్‌కు 6.60 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీరిలో 5.60 లక్షల మంది ఆర్మీలో, మిగతావారు ఇతర సరిహద్దు భద్రతా విభాగాల్లో ఉన్నారు.
పాక్ వద్ద 6వేలకుపైగా సాయుధ వాహనాలు, 4,600కుపైగా ఫిరంగి(ఆర్టిల్లరీ) యూనిట్లు ఉన్నాయి.
పాక్ వద్ద 465 యుద్ధ విమానాలు ఉన్నాయి.
పాక్ వద్ద 260కిపైగా సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి.
పాక్ వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్‌లు ఉన్నాయి.
వందల సంఖ్యలో యుద్ధ విమానాలు (F-16s, JF-17s), హెలికాప్టర్లు.
ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి ఇలా..
సైనిక శక్తిపరంగా ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ స్థానం 121వ స్థానం(145 దేశాల్లో)
సైనికుల సంఖ్య ఆప్ఘనిస్తాన్‌కు దాదాపు 1.72 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు
గతంలో అమెరికా వదిలివెళ్లిన హై మొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్ (హమ్వీ) సాయుధ వాహనాలు, ఎం4 కార్బైన్‌లను తాలిబన్లు వినియోగిస్తున్నారు.
తాలిబన్ల వద్ద అతికొద్ది సంఖ్యలో సాయుధ వాహనాలున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. కచ్చితంగా వాటి సంఖ్య తెలియదు
తాలిబన్ల వద్ద సోవియట్ కాలం నాటి 6 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి పనిచేయడం లేదని సమాచారం. ఈ లెక్కన వాళ్ల దగ్గర ఫైటర్ జెట్స్ లేనట్టే. అలాగే, సోవియట్ కాలం నాటి 23 హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ఎన్ని ఎగిరే స్థితిలో ఉన్నాయో తెలియదు
ఆప్ఘనిస్తాన్ వద్ద అణ్వాయుధాలు లేవు.
గెరిల్లా పోరాట వ్యూహం: గెరిల్లా పోరాట వ్యూహ రచనను పకడ్బందీగా అమలు చేసే విషయంలో తాలిబన్లు దిట్టలు. ఈ వ్యూహంతోనే వాళ్లు గతంలో 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీతో తలపడ్డారు. ఈ అంశం సరిహద్దుల్లో పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తెలిపింది. పాక్‌కు చెందిన సరిహద్దు ఆర్మీ పోస్ట్‌లకు తాలిబన్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇందుకోసం గెరిల్లా పోరాట వ్యూహాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు.


