టెక్ ప్రపంచంలో ట్రంప్‌ చిచ్చు | Trump Orders Federal Agencies To Halt Use Of Anthropic | Sakshi
Sakshi News home page

టెక్ ప్రపంచంలో ట్రంప్‌ చిచ్చు

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:33 AM

Trump Orders Federal Agencies To Halt Use Of Anthropic

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి కఠిన నిర్ణయంతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అగ్రరాజ్యం రక్షణ శాఖ (పెంటగాన్), ప్రముఖ ఏఐ  స్టార్టప్‌ ‘ఆంథ్రోపిక్‌’ (Anthropic) మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, చివరకు ఆ సంస్థపై బహిష్కరణ వేటుకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తీసుకున్న  నిర్ణయం ఇప్పుడు ప్రపంచ ‍వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్‌’ అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించవద్దని అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ‘మాకు ఆ టెక్నాలజీ అవసరం లేదు, అది మాకు వద్దు.. ఇకపై ఆ సంస్థతో ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండవు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇప్పటికే మిలిటరీ ప్లాట్‌ఫారమ్‌లలో అంతర్భాగంగా ఉన్న ‘ఆంథ్రోపిక్‌’ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్‌కు ఆరు నెలల గడువు ఇచ్చిన అధ్యక్షుడు, మిగిలిన ప్రభుత్వ సంస్థలు తక్షణమే దీని వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీలో  కలకలం సృస్టిస్తోంది. 


ఏఐ సాంకేతికతను సైనిక అవసరాల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకోవాలంటూ పెంటగాన్ చేసిన డిమాండ్ ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తమకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని రక్షణ శాఖ ‘పెంటగాన్‌’ పట్టుబట్టగా, ‘ఆంథ్రోపిక్‌’ సీఈఓ డారియో అమోడెయ్ అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. తమ ఏఐ మోడల్ ‘క్లాడ్’ (Claude)ను నిఘా కోసమో లేదా మనుషుల ప్రమేయం లేకుండా పనిచేసే  మారణాయుధాల తయారీ కోసమో వినియోగించకూడదని ‘ఆంథ్రోపిక్‌’ డిమాండ్‌ చేస్తోంది. అయితే రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ విధించిన తుది గడువు ముగియడానికి కొద్ది గంటల ముందే ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ ‘ఆంథ్రోపిక్‌’ సంస్థ ప్రభుత్వానికి సహకరించకపోతే, తీవ్రమైన సివిల్, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఎలాన్ మస్క్‌కు చెందిన 'గ్రోక్' (Grok) ఏఐకి భారీగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గ్రోక్‌ను ఇప్పటికే క్లాసిఫైడ్ మిలిటరీ నెట్‌వర్క్‌లలోకి అనుమతించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోంది. కాగా, ఈ వివాదంలో ‘ఆంథ్రోపిక్‌’ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా గూగుల్, ఓపెన్ ఏఐ ఉద్యోగులు బహిరంగ లేఖ రాయడం విశేషం. ప్రత్యర్థి సంస్థ అయినప్పటికీ, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం పెంటగాన్ బెదిరింపు ధోరణిని తప్పుపడుతూ ‘ఆంథ్రోపిక్‌’కు అండగా నిలిచారు.

క్లాడ్ వంటి అధునాతన వ్యవస్థలు జాతీయ భద్రతకు అత్యవసరమని ఒకపక్క చెబుతూనే, మరోపక్క ఆ సంస్థను 'సప్లై చైన్ రిస్క్'గా పరిగణించడం విరుద్ధమని ‘ఆంథ్రోపిక్‌’ సీఈఓ అమోడెయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య రక్షణ అవసరాలు, ఏఐ నైతిక విలువల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.

ఇది కూడా చదవండి: కాషాయ దుస్తుల్లో ప్రధాని మోదీ పక్కన.. సారా నెతన్యాహు సంగతులివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement