ఒకవైపు ఆహ్లాదాన్ని పంచే మంచు కొండలు... మరోవైపు కవ్వించే శత్రు మూకలు! పర్యాటకులకు భూతల స్వర్గం... స్థానికులకు నిత్య నరకం! ఇదీ ఒకప్పుడు జమ్మూకశ్మీర్ పరిస్థితి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న అక్కడి యువత... ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో సంచలనం నమోదు చేసింది. మహామహా జట్లను మట్టికరిపిస్తూ... రంజీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచింది. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే అదేదో సోమవారం ప్రారంభమై... శనివారం ముగిసిన ప్రక్రియ మాత్రం కాదు. దాని వెనకున్న కృషిని ఓ సారి పరిశీలిస్తే...
లీగ్ దశలో జమ్మూకశ్మీర్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రాజస్తాన్, ఢిల్లీ, హైదరాబాద్‌పై విజయాలతో గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ముంబై చేతిలో మాత్రమే ఓడి మూడు మ్యాచ్‌లను ‘డ్రా’చేసుకోవడం ద్వారానే ‘ఈసారి వదిలి పెట్టేదే లేదు’అనే సంకేతాలు పంపింది. ఇప్పటి వరకు క్వార్టర్ ఫైనల్ దశ దాటిన అనుభవం లేని జమ్మూకశ్మీర్ జట్టు... ఈ సారి పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది.
ఒక్కో ప్రత్యర్థి కోసం ఒక్కో వ్యూహాన్ని రచించడమే కాకుండా... దాన్ని మైదానంలో పకడ్బందీగా అమలు చేసి ఫలితం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను మట్టికరిపించిన జమ్మూ... సెమీస్‌లో బెంగాల్‌ను బెంబేలెత్తించింది. ఈ రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్నా... జమ్మూ సమష్టి ప్రదర్శన ముందు నిలవలేకపోయాయి.
ఫైనల్లో అయితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, ప్రసిధ్ కృష్ణ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్న కర్ణాటకపై ఐదు రోజుల పాటు ఏ దశలోనూ వెనక్కి తగ్గని జమ్మూ... నిజమైన చాంపియన్‌గా నిలిచింది.
విజయాల వెనక ఆ ముగ్గురు
దేశవాళీ ట్రోఫీలో దిగ్గజ జట్లను దాటుకుంటూ... జమ్మూకశ్మీర్ విజేతగా నిలవడం ఒక్కరోజులో సాధ్యమైందేమీ కాదు. క్రమశిక్షణ, కఠోర దీక్ష, సరైన ప్రణాళికతో సుదీర్ఘ కాలం పాటు చేసిన కృషికి దక్కిన ఫలితం. ఆ జట్టు ఈ స్థాయికి చేరడం వెనక ప్రధానంగా ముగ్గురి కృషి ఉంది. 2011లో జమ్మూ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ... జట్టు దృక్పథాన్ని మార్చాడు.
ఆయన శిక్షణలో రాటుదేలిన జమ్మూకశ్మీర్ జట్టు... 2013–14 సీజన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అప్పటి నుంచి అడపాదడపా విజయాలు సాధించడం పరిపాటిగా మార్చుకుంది... ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ మెంటార్‌గా ఉన్న సమయంలోనూ ఆ జట్టు క్వార్టర్స్‌కు చేరింది. అయితే మెరుగైన ఫలితాలు కావాలంటే మౌలిక వసతులు క ల్పించాలని సంక ల్పించింది మాత్రం ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్.
2021లో బీసీసీఐ నియమించిన సబ్ కమిటీలో సభ్యుడైన మిథున్... ఆ దిశగా అడుగులు వేశారు. ఆటగాళ్ల కోసం జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాల మొదలు... అజయ్ శర్మ వంటి మేటి కోచ్‌ను నియమించాడు. దీంతో జమ్మూ కశ్మీర్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అడపా దడపా విజయాలు సాధించే దశ నుంచి నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరుకుంది.
సమష్టి కృషితో
నాలుగు పదుల వయసు దాటిన కెపె్టన్ పారస్ డోగ్రా సారథ్య చతురత... జమ్మూకశ్మీర్ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. దేశవాళీల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన అనుభవం ఉన్న పారస్ జట్టును ముందుండి నడిపించడంలో సఫలీకృతమయ్యాడు. 17 ఏళ్ల పాటు హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి జట్లకు ప్రాతినిధ్యం వహించి గతేడాదే జమ్మూ పగ్గాలు అందుకున్న డోగ్రా... ఆ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాడు.
ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తున్నా సంయమనంతో ముందుకు సాగడమే కాకుండా... అవసరమైనప్పుడు దూకుడుతో ఆకట్టుకున్నాడు. అతడికి శుభమ్ పుండిర్, కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రా, కన్హయ్య వాధ్వాన్, అబ్దుల్ సమద్, శుభమ్ ఖజురియా చక్కటి సహకారం అందించారు. బౌలింగ్‌లో నజీర్, ఆబిద్ ముస్తాక్, సునీల్ కుమార్ సహకారంతో అఖీబ్ నబీ ఒక్కడే జట్టును లాక్కొచ్చాడు.
అతనొక్కడే!
జమ్మూకశ్మీర్ జట్టు నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్వేజ్ రసూల్ గురించే. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అతడు... జట్టు బలోపేతానికి విశేష కృషి చేశాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ వంటి వాళ్లు వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శన చేసినా... దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్న ఘనత మాత్రం కుడిచేతివాటం పేసర్ అఖీబ్ నబీదే.
గత రంజీ సీజన్‌లో 44 వికెట్లు పడగొట్టి... అందరి దృష్టి ఆకర్షించిన నబీ... ఈ సీజన్‌లో విశ్వరూపం కనబర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థుల వెన్ను విరిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే. అందులో ఏడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చాడు. జమ్మూ జట్టు నిలకడైన విజయాలు సాధించడం వెనక అతడి కృషి ఎంతో ఉంది. పేస్‌కు కచ్చితత్వాన్ని జోడిస్తూ... అతడు సంధిస్తున్న బంతులకు ప్రత్యర్థుల దగ్గర సమాధానాలే కరువయ్యాయి.
హైదరాబాదీ సిరాజ్ మాదిరిగా వరుసగా పది ఓవర్ల పాటు అలుపెరగకుండా ఒకే తీవ్రతతో బౌలింగ్ చేయగల సత్తా... ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల వైవిధ్యభరిత అ్రస్తాలు అతడి సొంతం. టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అఖీబ్ గత రెండు సీజన్‌లలో 104 వికెట్లు పడగొట్టి... సెలెక్టర్లకు తనని ఎంపిక చేయక తప్పని పరిస్థితి నెలకొల్పాడు. ఇప్పటికే మాజీలు చేబుతున్నట్లు... టీమిండియా తదుపరి ఆడబోయే తొలి టెస్టు మ్యాచ్ తుది జట్టులో అఖీబ్‌కు చోటు దక్కకపోతే ఆశ్చర్యమే!


