రంజీ ట్రోఫీ టైటిల్‌కు చేరువలో జమ్మూకశ్మీర్
కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం
నేడు ఆటకు చివరి రోజు
హుబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా
హుబ్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ విజేత తేలే సమయం ఆసన్నమైంది. సీజన్ ఆసాంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను ఓడిస్తూ ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ జట్టు... తొలి రంజీ టైటిల్ అందుకోవడం ఇక లాంఛనమే! బ్యాటర్ల సమష్టి ప్రదర్శనకు... బౌలర్ల సంపూర్ణ సహకారం తోడవడంతో... కర్ణాటకతో జరుగుతున్న రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (160 బంతుల్లో 94 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి చేరువకాగా... అబ్దుల్ సమద్ (70 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఓవరాల్‌గా జమ్మూకశ్మీర్ జట్టు ప్రస్తుతం 477 పరుగుల ముందంజలో ఉంది. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న జమ్మూకశ్మీర్ జట్టు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే టైటిల్‌ను ఖరారు చేసుకోవాలని భావిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం ఖాయం. అదే జరిగితే... కర్ణాటక ముందు భారీ లక్ష్యం నిలవడంతో పాటు తగినంత సమయం ఉండదు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం జమ్మూకశ్మీర్ జట్టుకు టైటిల్ దక్కుతుంది.
మయాంక్ ఒంటరి పోరాటం..
ఓవర్‌నైట్ స్కోరు 220/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... చివరకు 93.3 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (266 బంతుల్లో 160; 21 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కృతిక్ కృష్ణ (101 బంతుల్లో 36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 5 వికెట్లతో సత్తాచాటగా... సునీల్ కుమార్, యుధ్‌వీర్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో జమ్మూకశ్మీర్ జట్టుకు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఖతర్నాక్ కమ్రాన్...
తొలి ఇన్నింగ్స్‌లో తోటివాళ్లంతా చక్కటి ఆటతీరు కనబరిస్తే... ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సహచరులు ఆకట్టుకోలేకపోయినా... ఈసారి బాధ్యత తన భుజాలపై వేసుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
యావర్ హసన్ (1), శుభమ్ పుండిర్ (4), కెప్టెన్ పారస్ డోగ్రా (16) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కడుతున్నా... ఏమాత్రం తడబడకుండా చక్కటి షాట్‌లతో స్కోరు పెంచాడు. 89 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్... శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచాడు. అతడితో పాటు సాహిల్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులోఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ 2 వికెట్లు తీశాడు.
హుబ్లీలో జమ్మూకశ్మీర్ సీఎం
దేశవాళీల్లో ఇప్పటి వరకు ఒక్క పెద్ద టైటిల్ కూడా గెలవని జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ అందుకునేందుకు సిద్ధమైంది. ఈ మధుర క్షణాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హుబ్లీ చేరుకున్నారు.

గతంలో జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టుకు ఆడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సహా... పలువురు ప్రముఖులు సైతం జమ్మూకశ్మీర్ జట్టును అభినందించేందుకు ఫైనల్‌కు విచ్చేయనున్నారు.
స్కోరు వివరాలు
జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్ నబీ 13; మయాంక్ (ఎల్బీ) (బి) ఆఖిబ్ నబీ 160; పడిక్కల్ (సి) సమద్ (బి) సునీల్ 11; కరుణ్ నాయర్ (బి) ఆఖిబ్ నబీ 0; స్మరణ్ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్ 0; శ్రేయస్ గోపాల్ (ఎల్బీ) (బి) యుద్‌వీర్ 27; కృతిక్ (ఎల్బీ) (బి) సాహిల్ 36; విద్యాధర్ (సి) (సబ్) కుండల్ (బి) సునీల్ 11; విజయ్ కుమార్ వైశాఖ్ (నాటౌట్) 17; శిఖర్ శెట్టి (ఎల్బీ) (బి) ఆఖిబ్ నబీ 0; ప్రసిధ్ (సి)సునీల్ (బి) యుధ్‌వీర్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (93.3 ఓవర్లలో ఆలౌట్) 293. వికెట్ల పతనం: 1–27, 2–56, 3–57, 4–57, 5–162, 6–241, 7–256, 8–278, 9–288, 10–293. బౌలింగ్: ఆఖిబ్ నబీ 23–7–54–5; సునీల్ కుమార్ 19–6–51–2; యుద్‌వీర్ సింగ్ 14.3–3–55–2; ఆబిద్ ముస్తాఖ్ 23–2–75–0; సాహిల్ లోత్రా 12–1–50–1; అబ్దుల్ సమద్ 2–0–5–0.
జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (బ్యాటింగ్) 94; యావర్ (బి) ప్రసిధ్ 1; శుభమ్ (సి) (సబ్) శ్రీజిత్ (బి) విజయ్‌కుమార్ 4; పారస్ (బి) ప్రసిధ్ 16; సమద్ (సి) విజయ్‌కుమార్ (బి) శ్రేయస్ గోపాల్ 32; సాహిల్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (57 ఓవర్లలో 4 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–72, 4–145. బౌలింగ్: విజయ్‌కుమార్ 10–1–30–1; ప్రసిధ్‌కృష్ణ 12–0–42–2; విద్యాధర్ పాటిల్ 9–0–39–0; శిఖర్ శెట్టి 10–3–27–0; శ్రేయస్ గోపాల్ 16–6–27–1.


