సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, ఛానెల్స్‌లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.
ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.
సినిమాపై క్లారిటీ..
నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


