సిరిసిల్ల: బిచ్చగాడు సినిమాలో తల్లి బాగుండాలనే తపనతో తనయుడు కోటీశ్వరుడైనా.. ఒప్పందం మేరకు వీధుల్లో భిక్షాటన చేస్తాడు. అనేక ఇబ్బందులు పడుతాడు. చివరికి కథ సుఖాంతమవుతుంది. అచ్చం ఇలాగే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆది భిక్షువు నెలవైన వేములవాడ రాజన్న, భీమన్న సన్నిధిలో జరిగింది ఓ సంఘటన.. అతనో అడ్వకేట్.. ఆమె బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్. ఇద్దరూ భార్యాభర్తలు. కానీ అతను అడ్వకేట్‌గా కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె ప్రైవేటు ఉద్యోగం చేసేది. కానీ ఆమెను అనారోగ్యం వెంటాడింది. వైద్యం చేయించుకునేందుకు అనేక ఆస్పత్రులు తిరిగారు. కానీ, ఎంతకూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో మూడు నెలలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
19 ఏళ్లుగా కలిసి ప్రయాణం..
అతడి పేరు కాసర్ల జలందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలందర్‌రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన శిరీషతో 2006లో పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన పెళ్లి. వారికి పిల్లలు లేరు. కరీంనగర్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ.. జలందర్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. శిరీష దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. శిరీష అనారోగ్యం బారిన పడగా.. ఆమె వైద్యం కోసం అత్తగారు కట్నంగా ఇచ్చిన ప్లాటును అమ్మేసి వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఆమెకు నయం కాలేదు. పెద్దగా ఆస్తులు లేని ఆ దంపతులు సర్కారు వైద్యాన్ని నమ్ముకున్నారు. కానీ, శిరీష కోలుకోలేదు. దీంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆమె కోలుకుంటుందనే నమ్మకంతో సదరు దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అన్యోన్యతకు మారుపేరు
చిన్న చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధిగవిుస్తూ.. భిక్షాటన చేస్తూ, దేవుడి సన్నిధిలో భుక్తిసాధిస్తున్నారు. ఆమెను వదలించుకుని వెళ్లడం జలంధర్‌రెడ్డికి పెద్ద విషయం కాదు. కానీ, పెళ్లితో ముడిపడిన ఆ బంధాన్ని కాదనలేక ఆత్మీయంగా ఉంటూ అన్యోన్యమైన దాంపత్యజీవితాన్ని సాగిస్తున్నారు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఎదురిస్తూ.. జీవన యానం సాగిస్తున్నారు.
అనర్గళ ఇంగ్లిష్‌కు అవాక్కయిన అధికారులు
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్పీ చంద్రయ్య వేములవాడలోని భిక్షగాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ పునరావాస చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జలంధర్‌రెడ్డి, శిరీష దంపతులు అనర్గళమైన ఇంగ్లిష్ వాగ్ధాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. వారి నేపథ్యం తెలుకున్నారు. దీంతో ఆ దంపతుల జీవన శైలి వెలుగులోకి వచ్చింది.
నాకు పెద్దగా ఆస్తులేమీ లేవు
నాకు పెద్దగా ఆస్తులు లేవు. అద్దె ఇంట్లో ఉంటూ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసేవాడిని. మా ఆవిడ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయాను. చివరికి దేవుడే దిక్కని ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నా. నాకు ‘సాక్షి’ పేపర్ అంటే ఇష్టం. నిత్యం చదువుతాను. చదువుకున్న నేను భిక్షగాళ్ల మధ్యలో ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ తప్పదు కదా.
– కాసర్ల జలంధర్‌రెడ్డి, అడ్వకేట్
పోలియో ఉన్నా పెన్షన్ ఇవ్వడం లేదు
నాకు 60 శాతం పోలియో ఉంది. సదరం శిబిరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. నాకు రేషన్, ఆధార్ కార్డు ఉంది. కానీ, సదరం సర్టిఫికెట్ లేదు. దీంతో నాకు పెన్షన్ కూడా రావడం లేదు. ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటే కొంతైనా మాకు సాయం చేసినట్లు అవుతుంది. భిక్షాటనతోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఆదుకుంటే మరో ఉపాధి మార్గం వెతుక్కుంటాం.
– కాసర్ల శిరీష, దివ్యాంగురాలు


