తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను పెంచింది వారే: వ‌రుదు క‌ళ్యాణి | Ysrcp Mlc Varudu Kalyani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను పెంచింది వారే: వ‌రుదు క‌ళ్యాణి

Feb 26 2026 8:40 PM | Updated on Feb 26 2026 8:45 PM

Ysrcp Mlc Varudu Kalyani Fires On Chandrababu

సాక్షి, అమరావతి: తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను పెంచింది వైఎస్సార్‌, వైఎస్‌ జ‌గ‌న్‌లేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అన్నారు. ఆమె ఇవాళ(గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఇంటి దైవం అంటూనే చంద్ర‌బాబు శ్రీవారి ప్ర‌సాదంపై నింద మోపాడంటూ.. ఆధారాల‌తో కూట‌మికి వ‌రుదు క‌ళ్యాణి కౌంట‌ర్‌ ఇచ్చారు.

టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిష‌న్ పార్టీ 
హిందూ మ‌తాన్ని ప‌రిర‌క్షిస్తామంటూనే త‌మ చ‌ర్య‌ల‌తో కూట‌మి నాయ‌కులు అడుగడుగునా హిందూ సాంప్ర‌దాయాల‌ను కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌ క‌డ‌ప‌లోని వేంప‌ల్లెలో నందీశ్వ‌ర ఆల‌యాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోష‌ల్ మీడియా విషం క‌క్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిష‌న్ పార్టీ అని అర్థం. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా విజ‌య‌వాడ‌లో పుష్క‌రాల పేరుతో 40కి పైగా ఆల‌యాల‌ను కూల్చేస్తే, వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక వాటిని నిర్మించారు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే తిరుమ‌లో వెయ్యి కాళ్ల మండ‌పాన్ని కూల్చివేశారు. ముఖ్య‌మంత్రులుగా ఉండి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను, స్వామి వారి వైభ‌వాన్ని పెంచిన ఘ‌న‌త తండ్రీకొడుకులు వైఎస్సార్‌, వైఎస్‌ జ‌గ‌న్‌ల‌కే ద‌క్కుతుంది. వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక శ్రీవాణి ట్ర‌స్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాల‌నీల్లో 4,111 కొత్త ఆల‌యాల నిర్మాణాలు మొద‌లు పెట్టి ఒక్క‌దానికి రూ.10 ల‌క్ష‌లు కేటాయించ‌డం జరిగింది.

అందులో 80 శాతం ప‌నులు రామాల‌యాలే. రూ. 411 కోట్ల‌తో 801 పురాత‌న ఆల‌యాల ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేయ‌డం జ‌రిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా ప్ర‌భుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘ‌న‌త వైఎస్‌ జ‌గన్‌కే ద‌క్కుతుంది. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా దుర్గమ్మ ఆల‌యంలో రాజ‌శ్యామ‌ల యాగాన్ని నిర్వ‌హించారు.

వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లో శ్రీవారి వైభ‌వం
తూర్పు గోదావ‌రి జిల్లా అంత‌ర్వేదిలో ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి ర‌థానికి దుండగులు నిప్పంటిస్తే క‌ళ్యాణోత్స‌వం స‌మ‌యానికి కొత్త ర‌థం త‌యారు చేయించి ఇస్తాన‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన ర‌థాన్ని అంద‌జేశారు. తిరుమ‌ల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన న‌వ‌నీత సేవ కోసం స్వ‌చ్ఛ‌మైన వెన్న‌ను స‌మ‌కూర్చ‌డం కోసం తిరుమ‌లలోని గోశాల‌ను విస్త‌రించ‌డం వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉండగానే జ‌రిగింది. చిన్నారుల్లో భ‌క్తిభావం పెంపొందించ‌డం కోసం గోవింద కోటి, రామ కోటి రాసే వారికి ఉచితంగా పుస్త‌కాల‌ను పంపిణీ చేయ‌డ‌మే కాకుండా వారికి శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌డం జ‌రిగింది.

టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్ల ప‌ట్టాల‌తోపాటు వేత‌నాలు పెంచ‌డ‌మే కాకుండా కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టారు. వంశ పారంప‌ర్య అర్చ‌కుల‌కు రిటైర్మంట్ లేకుండా ఓపిక ఉన్నంత వ‌ర‌కు స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం క‌ల్పించారు. తిరుమ‌ల‌లోని స్వామి వారి గ‌ర్భ‌గుడిని స‌న్నిధి గొళ్ల‌లు తెరిచే సాంప్ర‌దాయాన్ని పున‌రుద్ధ‌రించారు. అమ‌రావ‌తి, చెన్నై, భువ‌నేశ్వ‌ర్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, విశాఖ‌ప‌ట్నంతోపాటు అమెరికాలో శ్రీవారి ఆల‌యాల‌ను నిర్మించి స్వామి వారి ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ‌వ్యాప్తం చేశారు. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్ త‌ర‌హాలోనే వైఎస్‌ జ‌గ‌న్ కూడా ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా వేద విద్య‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో అతి ముఖ్య‌మైన గ‌రుడ సేవ‌లో భ‌క్తులంద‌రూ ద‌ర్శించుకునేలా ప్ర‌తి పౌర్ణ‌మికి పున్న‌మి గ‌రుడ సేవ నిర్వ‌హించేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం వైఎస్‌ జ‌గ‌న్
మ‌ఠాధిప‌తులు, ఆగ‌మ పండితుల‌తో ఆగస్టు 2022లో రెండో విడ‌త ధార్మిక ప‌రిషత్తును నియ‌మించి నిర్ణ‌యాధికారాల‌ను క‌ల్పించిన ఘ‌న‌త కూడా వైఎస్‌ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా వివాదాల‌తో కోర్టు కేసుల కార‌ణంగా కాల‌యాప‌న జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో దేవాల‌య భూములు స్వాధీనం చేసుకునే అధికారం ప్ర‌భుత్వానికి క‌ల్పించి స్వామి వారి ఆస్తుల‌ను కాపాడారు. రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉండే ఆల‌యాల‌కు వంశ‌పారంప‌ర్య హ‌క్కుల‌ను స్ధానిక భ‌క్తుల క‌మిటీల‌కు క‌ల్పిస్తూ జీవో ఇచ్చారు.

జీవో నెంబ‌ర్ 52 ద్వారా గ‌తంలో రూ.5 వేలు వేత‌నాలు పొందేవారికి రూ.10 వేలు, రూ. 10 వేలు పొందేవారికి రూ.15625 ల చొప్పున వేత‌నాలు పెంచుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఆనాడు నిర్ణ‌యం తీసుకుంది. అర్చ‌క సంక్షేమ ట్ర‌స్టు ద్వారా బ్రాహ్మ‌ణుల‌కు రూ.48 కోట్ల మేర ల‌బ్ధి చేకూర్చారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లుగా అరర్చ స‌మాఖ్య నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. 16 ఆగమ వేద పాఠ‌శాల‌ల ద్వారా 400 మంది విద్యార్థుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌తోపాటు వారికి స్టై ఫండ్ కింద రూ. 3 కోట్లు చెల్లించారు. ధూమ‌దీప నైవేద్యాల ప‌థ‌కం గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో కేవ‌లం 1100 ఆల‌యాల‌కు మాత్ర‌మే ఉండ‌గా వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ఆ సంఖ్య‌ను 5338 ఆల‌యాల్లో అమ‌లు చేసింది.

వైఎస్సార్‌ హయాంలోనే శ్రీవారి వైభ‌వం పెరిగింది
ఆల‌యాల్లో రాజ‌కీయ నేత‌ల జోక్యానికి తావులేకుండా దేవాదాయ శాఖ‌లో కీల‌క‌నిర్ణ‌యాలు తీసుకునేలా 21 మందితో ధార్మిక ప‌రిష‌త్‌ను ఏర్పాటు చేస్తూ 2007లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. శ్రీవారి ఆల‌యంలో పిల్ల‌ల‌కు, క్యూలైన్ల‌లో ఉండేవారికి ఉచితంగా పాలు, అన్న‌ప్ర‌సాద పంపిణీ కార్య‌క్ర‌మానికి కూడా వైయ‌స్సార్ గారే శ్రీకారం చుట్టారు. వేద విద్య‌, విజ్ఙానం, ప‌రిశోధ‌న‌లు ప్రోత్స‌హించే ఉద్దేశంతో 2006లో వైయ‌స్సార్ గారు వేద విద్యాల‌యాన్ని ప్రారంభించారు. ఏడు కొండ‌ల వైభ‌వాన్ని చాటేలా వేంక‌టేశ్వ‌ర‌ భ‌క్తి ఛానెల్‌ను ప్రారంభించారు.

తిరుప‌తి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచిత ల‌డ్డూ ప్ర‌సాదం అందజేయ‌డంతోపాటు అలిపిరి వ‌ద్ద నిత్య హోమం జ‌రిపేలా  కూడా వైయ‌స్సార్ గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే ప్రారంభించారు. 2006లో క‌ళ్యాణమ‌స్తు ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసి మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌లో వివాహం చేసుకునే ప్ర‌తి జంట‌కు బంగారు మంగ‌ళ‌ సూత్రం, వెండి మెట్టెలు, నూత‌న వ‌స్త్రాలు, త‌లంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్త‌కం, పురోహితుడు, పెళ్లి భోజ‌నం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. బంగారు మంగ‌ళ‌సూత్రం, వెండి మెట్టెలు, శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజ‌లు నిర్వ‌హించి 36 వేల నూత‌న జంట‌ల‌కు పంపిణీ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

ద‌ళిత గిరిజ‌న గోవిందం పేరుతో విప్ల‌వాత్మ‌క‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టి శ్రీవారిని ద‌ళిత గిరిజ‌న వాడ‌ల‌కు తీసుకెళ్లి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించే భృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం కూడా దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే ప్రారంభించారు. మ‌త్స్య‌కారుల‌కు వైదిక క‌ర్మ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చే స‌మానత్వాన్ని కూడా ఆయ‌నే ప్రారంభించారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌, స్వామి వారి ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింపజేయ‌డం కోసం వైయ‌స్సార్ గారు ఎంతో శ్ర‌మించారు. కానీ చంద్ర‌బాబు మాత్రం మా ఇంటి దైవం అంటూనే త‌న త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆల‌య ప్ర‌తిష్ట‌ను మంట‌గ‌లిపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement