సాక్షి, నంద్యాల: ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్ట్ విషయంలో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమకు ద్రోహం చేస్తూ మీడియా సమావేశాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేయడమేంటి?. నిజాయితీగా నీటిని అందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు కృషి చేయాలి. కూటమి నేతలు సవాల్ విసరడం బాగానే ఉంది కానీ పాలకులుగా మీకు బాధ్యత లేదా?. చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్‌కు మేము సిద్ధమే. రాయలసీమ ప్రాంతవాసులకు నీరు అందించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.



