టీమిండియా స్టార్, హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ అనూహ్య రీతిలో జట్టుకు దూరమయ్యాడు. పొత్తి కడుపునకు సంబంధించిన సమస్య కారణంగా ఇటీవల అతడు తీవ్ర నొప్పితో బాధపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అత్యవసరంగా తిలక్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
వేగంగా కోలుకుంటున్నాడు
దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma) .. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే ఆ తర్వాతే.. మైదానం బయట సమస్య మొదలైంది. ‘పొత్తి కడుపు సమస్యతో తిలక్‌కు ఇబ్బంది ఎదురైంది. దాంతో రాజ్‌కోట్‌లో బుధవారం తిలక్‌వర్మకు శస్త్రచికిత్స జరిగింది.
గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తిలక్ శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వెళతాడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది.
సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతే
తాజా పరిణామం కారణంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తిలక్ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల విషయంపై కూడా బోర్డు ఇంకా స్పష్టతనివ్వలేదు.
‘తిలక్ ప్రస్తుతం సమస్య నుంచి కోలుకొని సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతే ట్రైనింగ్ మొదలు పెడతాడు. ఆపైనే అతని ప్రాక్టీస్ ఉంటుంది. అతని ఆరోగ్యం, కోలుకునే విషయంలో పురోగతిని బట్టి చివరి రెండు మ్యాచ్‌లలో ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’ అని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో టీ20లు ఆడే భారత జట్టులో తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్న చర్చ మొదలైంది.
‘సర్పంచ్’ సాబ్ రావాల్సిందే
ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా.. ‘‘తిలక్ వర్మ గాయపడ్డాడు. అతడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మరి టీమిండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?... నా అభిప్రాయం ప్రకారం.. ఆ ఆటగాడు మరెవరో కాదు.. శ్రేయస్ అయ్యర్. అవును.. ‘సర్పంచ్’ సాబ్ ఆటోమేటిక్‌గా జట్టులోకి రావాల్సిందే.
అప్పుడు అతడికి అన్యాయం
దేశీ టీ20 టోర్నీలోనే కాదు.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ పొట్టి క్రికెట్ తరహాలో అతడు అదరగొడుతున్నాడు. నిజానికి తన ఫామ్ దృష్ట్యా అతడు ఆసియా టీ20 కప్ టోర్నీ-2025 కూడా ఆడాల్సింది. కానీ సెలక్టర్లు అతడికి అన్యాయం చేశారనిపించింది. ఆ టోర్నీకి అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పటికీ అర్థం కాలేదు.
అయితే, ఇప్పుడు మిడిలార్డర్‌లో ఆడేందుకు శ్రేయస్‌కు ఓ అవకాశం దొరికింది. అతడొక అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఐపీఎల్‌లో అతడి క్రేజే వేరు. తన అద్భుత ఆట తీరుతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి తిలక్ స్థానంలో నేనైతే శ్రేయస్ అయ్యర్‌కే ఓటు వేస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ఊహించని పేరు కూడా
ఇక శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. తన సెకండరీ ఆప్షన్‌గా ఆకాశ్ చోప్రా.. అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు జితేశ్ శర్మ కూడా పోటీలోకి రావచ్చొన్న ఈ మాజీ ఓపెనర్.. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్‌కే చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఇక ఓపెనర్లతో ఇప్పుడు టీమిండియాకు పనిలేదు కాబట్టి.. శుబ్‌మన్ గిల్ టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్ లేదన్నాడు.
చదవండి: అతడో గ్యాంబ్లర్.. కొంచెం కూడా భయం లేదు: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఫైర్


